తాగునీటి కష్టాలకు కారణం కేసీఆరే..  | Sakshi
Sakshi News home page

తాగునీటి కష్టాలకు కారణం కేసీఆరే.. 

Published Tue, Feb 6 2024 1:39 AM

Komatireddy Venkat Reddy Comments on KCR - Sakshi

నల్లగొండ: ‘‘మాజీ సీఎం కేసీఆర్‌ కృష్ణా ప్రాజెక్టులను బీజేపీకి తాకట్టు పెట్టారు. పైగా రేవంత్‌రెడ్డే కేంద్రానికి అప్పగించారని ఉల్టా మాట్లాడుతున్నారు. దీనిపై నల్లగొండలో సభ పెడతామంటున్నారు. కేసీఆర్‌ నల్లగొండకు ఎలా వస్తారో చూస్తాం. కేసీఆర్‌ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆయన మిలటరీని పెట్టుకుని వచ్చినా నల్లగొండ ప్రజలు తరిమికొడతారు’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం సొరంగమార్గం), డిండి లిఫ్ట్, లోలెవెల్‌ కెనాల్‌ ప్రాజెక్టులను పక్కనబెట్టి దక్షిణ తెలంగాణకు కేసీఆర్‌ అన్యాయం చేశారని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ మంజూరు చేస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని.. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడ్డారు. తన బిడ్డ కవిత లిక్కర్‌ కేసులో జైలుకు పోకుండా ఉండేందుకు కేసీఆర్‌ బీజేపీకి తలొగ్గి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో కుమ్మక్కై ఏపీ రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు.

కేసీఆర్‌ పారిపోయేలా ఉన్నారు!
కమీషన్ల కోసం చేసిన ప్రాజెక్టుల వల్లే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అరెస్టు అయ్యారని.. కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేస్తారంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే కేంద్రం ఏం చెబితే కేసీఆర్‌ అది చేశారని ఆరోపించారు. ‘‘పులి వస్తోందని హరీశ్‌రావు అంటున్నారు. పులి లేదు, గిలి లేదు. మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే. కేసీఆర్‌ ఓడిపోయినా ప్రైవేటు స్పెషల్‌ ఫ్లైట్‌ను ఇంకా ఎందుకు రద్దు చేసుకోలేదు? కవిత లిక్కర్‌ కేసు సమయంలో అద్దెకు తీసుకుని, మాజీ సీఎం అయినా దాన్ని అలానే ఉంచారంటే ఏ రాత్రి అయినా అరెస్టు చేస్తామంటే.. ఠక్కున ఫ్యామిలీ అంతా పారిపోయేందుకు స్పెషల్‌ ఫ్లైట్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. దుబాయ్‌ వెళ్లిపోతే ఎవరూ అరెస్టు చేయరనేది వారి ఉద్దేశం..’’ అని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ విషయంలో కేసు నమోదవడం, కేసీఆర్, హరీశ్‌రావు అరెస్టవడం ఖాయమని పేర్కొన్నారు.

హంతకుడికి మంత్రి పదవి ఇచ్చారు
నల్లగొండ జిల్లాకు చెందిన హంతకుడికి కేసీఆర్‌ మంత్రి పదవి ఇచ్చారని.. ఆ మంత్రి అవినీతికి పాల్పడ్డారే తప్ప ఏనాడూ ప్రాజెక్టులను సందర్శించలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి వెంకట్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రెండు పూటలా తిండికి లేని వ్యక్తి మంత్రి అయ్యాక దోపిడీకి పాల్పడ్డాడని, యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో దోచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఆ అవినీతిపై విచారణ చేయిస్తున్నామని, ఆయన జైలుకుపోక తప్పదని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అంతా అవినీతేనని, హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి దగ్గరే వెయ్యి కోట్లు దొరికాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement