Kishan Reddy: ‘మునుగోడులో బీజేపీదే విజయం.. సర్వేలన్నీ మాదే గెలుపు అంటున్నాయి’

Kishan Reddy Says BJP Will Win In Munugode Assembly ByPoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌తో తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కాగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి.. మునుగోడు బరిలో నిలవగా.. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీలో ఉంటే అవకాశం ఉంది. 

కాగా, మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నాము. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సర్వసన్నద్ధంగా ఉంది. మునుగోడులో భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుంది. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరికి మొదటి స్థానం.. ఎవరికి మూడో స్థానం ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే మా నిర్ణయం. మునుగోడులో చేపట్టిన సర్వేలన్నీ బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. విజయం మాదే’ అని కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం బండి సంజయ్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర నాలుగు విడతలను పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్రను చేపట్టాలని బండి సంజయ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top