
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడింది. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ను (D. K. Shivakumar) సీఎంను చేయాలంటూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు డీకేఎస్ వెంట ఉన్నారంటూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. ఈ క్రమంలో డీకేఎస్ సైతం హస్తినలో పర్యటించడం.. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే?
2023లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్ధరామయ్య(Siddaramaiah)కు సీఎం పదవి, డీకేఎస్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఆ సమయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై డీకేఎస్ వర్గం అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. పైకి మాత్రం సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు, తర్వాత డీకే శివకుమార్ సీఎం అయ్యేలా ఒప్పందాలు జరిగాయంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాల గడువు సెప్టెంబర్‌లో ముగియనుండటంతో, డీకే శివకుమార్ మద్దతు దారులు మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ మాట్లాడుతూ.. ‘అవును, చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని కోరుతున్నారు. మా జిల్లా ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు’ అని చెప్పారు. మరో ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతుగా ఉన్నారు అని పునరుద్ఘాటించారు.
ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చు
కర్ణాటక రాజకీయంపై ఇప్పటికే ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Surjewala)కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చు. కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు . గతంలో ఇదే వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం రణదీప్ సూర్జేవాలాను మధ్యవర్తిగా వ్యవహరించారు.
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
మరోవైపు తనని సీఎంను చేయాలంటూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్లపై డీకే శివకుమార్ స్పందించారు. నా కోసం మాట్లాడమని నేను ఎవరికీ చెప్పలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అది శిరోధార్యమని స్పష్టం చేశారు.
పార్టీ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యను మార్చే ఉద్దేశం లేదని అధికారికంగా ఆయనను మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యను కొనసాగించాలనే వైఖరిలోనే ఉంది. కానీ డీకే శివకుమార్ వర్గం నుంచి వచ్చే ఒత్తిడి, ఎమ్మెల్యేల మద్దతు,2028 ఎన్నికల దృష్ట్యా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమోనని డీకే వర్గం భావిస్తోంది. మరి ముందుముందు ఏమవుతుందో చూడాలి మరి