
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో ప్రజారంజకంగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో కుట్రలకు తెరలేపారని ఏపీ ఎస్సీ,ఎస్టీ, కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ విమర్శించారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఓ సామాజిక వర్గానికి చెందిన వారు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలను సేకరించి వ్యవస్థలను ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు. బాబు కుట్రలపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
కేంద్రంలోని కమలనాథులు విశాఖపట్నం నగర విశిష్టతను దెబ్బతీసే విధంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రకు తెరలేపారని చెప్పారు. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన రహస్య ఒప్పందంతో పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ బరిలోనూ వైఎస్సార్‌సీపీ సత్తా చాటు తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తన నేతృత్వంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు సి.ఎం.మంగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు తిరగటి శివ, నగర అ«ధ్యక్షుడు దేబరుకుల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.