సీఎం విజయ్‌ను కలిసిన కమల హాసన్‌.. కీలక వ్యాఖ్యలు | Kamal Haasan meets Tamil Nadu CM Vijay | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌ను కలిసిన కమల హాసన్‌.. కీలక వ్యాఖ్యలు

May 16 2026 8:53 PM | Updated on May 16 2026 9:21 PM

Kamal Haasan meets Tamil Nadu CM Vijay

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ను శనివారం సినీనటుడు, మక్కల్ నీది మయ‍్యం అధినేత కమల హాసన్‌ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కమల హాసన్ శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. “ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్‌ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపాను. తమిళనాడు అభివృద్ధి విషయంలో ఉన్న ఆశయాలను ఆయన ఉత్సాహంగా చెప్పారు. ఈ సమావేశంలో ఆయన చూపిన వినయం, అభిమానం నాకు గర్వంగా అనిపించాయి” అని తెలిపారు.

ఈ సమావేశంలో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కీలక వినతులను కూడా సమర్పించినట్లు కమల హాసన్‌ వెల్లడించారు. “పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న తమిళ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమిళనాడు ప్రభుత్వానికి 6 కీలక డిమాండ్లు చేశాను” అని తెలిపారు.

ఇంతకుముందు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిదానికి కమల హాసన్ మద్దతు తెలిపారు. తమిళనాడులో ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కొన్ని రోజుల క్రితం వినోద రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న నటుడికి ఏమైనా సలహా ఇస్తారా అని కమల్‌ను ప్రశ్నించగా.. కొత్త ప్రభుత్వానికి, మద్యం దుకాణాల మూసివేత నిర్ణయానికి అభినందనలు తెలిపారు. “తమిళనాడు కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. 717 మద్యం దుకాణాల మూసివేత స్వాగతించదగ్గ నిర్ణయం. దీని గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఇప్పుడు అమలు చేశారు. ఇది ప్రశంసనీయం” అన్నారు.

విజయ్ రాజకీయ ప్రయాణంపై కమల్ ఇంకా మాట్లాడుతూ.. “విజయ్‌ను కేవలం సినీ నటుడిగా మాత్రమే చూడకూడదు. ఆయనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు. మన పరిశ్రమ నుంచి విజయ్ అధికారంలోకి రావడం గర్వకారణం” అన్నారు. కాగా, విజయ్ రాజకీయ పార్టీ టీవీకే పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement