ఔను.. మళ్లీ ‘వాళ్ల మాటే’ నెగ్గింది

Introspection Among TDP Vijayawada Leaders - Sakshi

అందరూ వద్దన్నా.. కేశినేనికే కోరస్‌!   

ఇక్కడ శ్వేత, అక్కడ నాని...

వారికేనా మేయర్‌ పీఠం?

మాటకు విలువలేనప్పుడు మనకెందుకీ పాకులాట! 

టీడీపీ నగర నేతల్లో అంతర్మథనం

నిన్నటిదాక పార్టీ జెండా భుజాన మోస్తున్న వాళ్లందరికీ ఎంపీ  ‘కేశినేని’ అస్మదీయుడు. ఇవాళ తస్మదీయుడయ్యాడు.  తమ క్యాడర్‌ చేతుల్లోనే అధికారం ఉండాలన్న కాంక్ష, తమ వర్గీయులే పదవుల్లో సాగాలన్న ఉత్సుకతే  దీనికి కారణమైంది. విజయవాడ మేయర్‌ పీఠంపై ఏకంగా తమ కుమార్తెను కూర్చోబెట్టాలన్న నిర్ణయంపై పలువురు వ్యతిరేకించినా చివరకు వాళ్ల మాటే నెగ్గింది.  

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అవును, మళ్లీ వాళ్ల మాటే నెగ్గిందని విజయవాడ నగర టీడీపీలో మారుమోగుతోంది. చంద్రబాబు సామాజికవర్గం వారికే ప్రాధాన్యమా అనే ప్రశ్న పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ తెలుగుదేశం పార్టీ మేయర్‌ అభ్యర్థిగా కుమారి కేశినేని శ్వేత గారిని నిర్ణయించడం జరిగింది’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేరిట ప్రకటన విడుదల కావడంతో నగర నేతల్లో అంతర్మథనం ఆరంభమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు అర్బన్‌లోని ముఖ్య నాయకులు కూటమి కట్టి మేయర్‌ అభ్యర్థి విషయంలో తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలియజేశారు.

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) తన కుమార్తె శ్వేతే పార్టీ తరపున మేయర్‌ అభ్యర్థిని అని చేసిన ప్రకటనను పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మైనార్టీ సీనియర్‌ నాయకుడు నాగుల్‌ మీరా తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పార్టీ సీనియర్‌ నేతలు మొదలు చంద్రబాబుతో సహా అందరి వద్దా వద్దంటూ కుండబద్దలు కొట్టారు. కానీ శ్వేత పేరును అధిష్ఠానం ఖరారు చేయడంతో పార్టీలో తమ అభి ప్రాయాలకు విలువెంతో స్పష్టమైందని అంతర్గత చర్చల్లో వాపోతున్నారు.

‘గుంటూరులో కోవెలమూడి రవీంద్ర (నాని), విజయవాడలో కేశినేని శ్వేత... మేయర్‌ పీఠాలకు వారే అర్హులా? ఓసీల్లో ఇంకెవరూ లేరా? మరెవరూ పనికిరారా? ఆ సామాజిక వర్గం వారికి ఇంకెవరూ సరితూగరా? ’ అనే వాదనను బాహాటంగానే లేవనెత్తారు. పార్టీ రహితమైనప్పటికీ టీడీపీ మద్దతుదారులుగా పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా పరువుపోగొట్టుకున్న నేపథ్యంలో పురపోరులోనైనా గట్టిపోటీ ఇవ్వాలని నగరంలోని ముఖ్య నాయకులు భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండేసి అసెంబ్లీ స్థానాలు, ఒక్కో ఎంపీ సీటుతో సరిపెట్టుకుంది. గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీకి దూరమవడంతో పాటు చంద్ర బాబు తీరును సందర్భం వచ్చినప్పుడల్లా తూర్పారపడుతున్నారు. ఇప్పటికే అన్నివిధాలా కునారిల్లిపోయిన పార్టీ తాజా ప్రకటనతో మరింత కుంగిపోవడమే తరువాయని పార్టీ శ్రేణులు నెత్తీనోరూ బాదుకుంటున్నాయి.  

రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించే విజయవాడ మేయర్‌ పీఠం ఫలానా వారికే అనే ప్రకటన చేయవద్దని, ఒకవేళ ఎవరి పేరునైనా ముందుగా ప్రకటిస్తే అందరినీ సమన్వయపరచుకుని ముందు కు వెళ్లడం అసాధ్యమని నగర నేతలు అధిష్ఠానానికి వివరించారు. చంద్రబాబు వారి మాటలకు ప్రాధా న్యం ఇచ్చినట్లే వ్యవహరించారు. తాను ఎవరి పేరు ను చెప్పలేదని, కేశినేనికి కూడా హామీ ఇవ్వలేదని నమ్మబలికారు. సమన్వయంతో పనిచేసి మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించాలని హితబోధ చేయడంతో అంతా సర్దుకున్నట్లే భావించారు. ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమవుతున్న తరుణంలో శ్వేత పేరు ప్రకటన టీడీపీకి శరాఘాతమేనని పరిశీలకులు    అభిప్రాయపడుతున్నారు.  

రెండుగా చీలిన నేతలు! 
విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. కేశినేని శ్రీనివాస్‌కు గద్దె రామ్మోహన్‌ వెంట ఉంటున్నారు. బొండా, బుద్దా, నాగుల్‌మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె çపూజితకు ఇచ్చిన టిక్కెట్‌ను కేశినేని నాని మార్చేశారు. ఈ విషయమై బుద్ధా, మీరాలు పట్టుపట్టినా ఎంపీ ససేమిరా అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్‌ విషయంలోనూ అదే జరిగింది. పేదసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్‌ ఇప్పించుకోలేకపోయినట్లు పొలిట్‌ బ్యూరో సభ్యుడు, జాతీయ కార్యదర్శి కూడా అయిన వర్ల రామయ్య తన అనుచరవర్గం వద్ద అంతర్గత చర్చల్లో వాపోయినట్లు సీనియర్‌ నేతలు గుర్తు చేస్తున్నారు.

డిప్యూటీ మాజీ మేయర్‌ గోగుల వెంకట రమణారావు అవినీతిపరుడని, ఆయనకు టిక్కెట్‌ వద్దేవద్దని మాజీ ఎమ్మెల్యే బొండా, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘు తదితరులు భీష్మించారు. నిరసన ప్రదర్శన  నిర్వహించినా ఎంపీ కేశినేని మాటే నెగ్గింది. నగరంలోని ఇతర సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ల మాటలు కనీసం చెల్లుబాటు కానప్పుడు, విలువే లేనప్పుడు తామెందుకు ఆరాటపడాలనే అభిప్రాయాలు ఆయా వర్గాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.  

కోనేరు శ్రీధర్‌ మినహా..   
విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయరుగా 1981లో టి.వెంకటేశ్వరరావు (రెండుసార్లు) బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత మేయర్లుగా పాలనా పగ్గాలు చేపట్టిన వారిలో అయితా రాములు (రెండుసార్లు) లంకా గోవింద రాజులు, జంధ్యాల శంకర్, పంచుమర్తి అనూరాధలు ఉన్నారు. మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ మేయర్లుగా తాడి శకుంతల, మల్లికా బేగం, ముత్తంశెట్టి రత్నబిందు బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి కోనేరు శ్రీధర్‌ మేయర్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేతను   ప్రకటించడం గమనార్హం.
చదవండి:
టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు భంగపాటు 
తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top