హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూలు రేపు లేదా ఎల్లుండి?

Huzurabad by-election schedule will be soon - Sakshi

ప్రధాన పార్టీలకు అందిన సంకేతాలు.. అందుకే ఊపందుకున్న కార్యకలాపాలు?

వాసాలమర్రిలో హడావుడిగా దళితబంధు ప్రారంభం 

నేడు ఆసుపత్రి నుంచి నేరుగా నియోజకవర్గానికి ఈటల 

టీపీసీసీ చీఫ్‌ అధ్యక్షతన ఉప ఎన్నికపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ శుక్ర లేదా శనివారం వెలువడనుందా? ఈ మేరకు ప్రధాన రాజకీయ పార్టీలకు సంకేతాలందాయా? వారం రోజులుగా ముమ్మరంగా సాగుతున్న ఆయా పార్టీల కార్యకలాపాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. అయితే బుధవారం వాసాలమర్రి దళితవాడను సీఎం సందర్శించిన నేపథ్యలో దళితబంధు లబ్దిదారుల ఎంపిక, గురువారం చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించడానికి హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూలు విడుదల సంకేతాలందడమే కారణమనే ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్‌లో పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరికలకు సీఎం కేసీఆర్‌ స్వయంగా హాజరవడం, కౌశిక్‌రెడ్డిని మూడ్రోజుల క్రితం గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేట్‌ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. మంత్రి హరీశ్‌రావు.. హుజూరాబాద్‌లో పార్టీ సమన్వయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. మరో మంత్రి గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. దీనికంతటికీ ఉపఎన్నిక షెడ్యూలుపై సంకేతాలు రావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

నేడు ఈటల డిశ్చార్జి.. అట్నుంచి హుజూరాబాద్‌కు 
పాదయాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆయన కోలుకునేందుకు 15 రోజులు పడుతుందని సన్నిహితులు అంటున్నారు. అయితే, ఆయన గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే, ఉదయం 10.30కి ఆసుపత్రి ఆవరణలోనే మీడియాతో మాట్లాడి నేరుగా హుజూరాబాద్‌ వెళ్తారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకుండానే ఈటల హుటాహుటీన నియోజకవర్గానికి వెళ్లడం వెనుక ‘ఉపఎన్నిక షెడ్యూలు’వార్తలే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమై హుజూరాబాద్‌ ఉపఎన్నికపై చర్చించింది. మూడు ప్రధాన పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూలు వారాంతంలోగా వెలువడుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top