Huzurabad Bypoll:1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్‌..

Huzurabad Bypoll 2021 Results: No Deposit Votes For Congress Party - Sakshi

హోరాహోరీ పోరులో డీలాపడిన పార్టీ

2018లో 61,121 ఓట్లు.. ఈ సారి 3,012 ఓట్లకే పరిమితం

కాంగి‘రేస్‌’లో ముందుకు రాని బలమైన కేడర్‌

కాంగ్రెస్‌ పార్టీకి హుజూరాబాద్‌ నియోజకవర్గం కలిసి రావట్లేదు. వరుసగా పరాజయాలను మూటకట్టుకుని చిక్కిశల్యమైన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఈ ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిటే కోల్పోయింది. అనివార్యంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత బలమైన అభ్యర్థినే బరిలోకి దింపుతారన్న ప్రచారం జరిగింది.

ఈస్థానం నుంచి పోటీ చేసేందుకు కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్యల పేర్లు వినిపించాయి. అధిష్టానం చివరి నిమిషంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతు కాగా, ఇక.. పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. 

1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్‌..
1952 ఏర్పడిన హుజూరాబాద్‌ ద్వి శాసనసభ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్‌ తరఫున పున్నమనేని నారాయణరావు, సోషలిస్టు పార్టీ నుంచి జి.వెంకటేశం గెలుపొందారు. తిరిగి 1957లో జరిగిన ద్వి శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నర్సింగరావు, రాములు విజయం సాధించారు. 1962లో ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేయగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాములు మరోసారి గెలుపొందారు. 1967లో పోల్సాని నర్సింగరావు, 1972లో వొడితెల రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా జయకేతనం ఎగుర వేశారు.

అనంతరం 1978, 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2008, 2009, 2010, 2014, 2018లో జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులెవరు గెలుపొందిన దాఖలాలు లేవు. ఆ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన ఓట్లు పొంది డిపాజిట్‌ దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రస్తుత ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించగా మొదటిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయారు. 1978 నుంచి నేటి వరకు కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందకపోగా మొదటిసారి బీజేపీ ఇక్కడి నుంచి గెలిచి చరిత్ర సృష్టించారు.

చదవండి: Telangana: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top