ఉత్తరాంధ్ర నాశనాన్ని కోరతారా?

Gudivada Amarnath Fires On Chandrababu - Sakshi

నిప్పులు చెరిగిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌  

మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమరావతి పాదయాత్ర.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. చంద్రబాబు సృష్టించిన అమరావతి దెయ్యాల రాజధాని అని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సాగుతున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది కదా అని ఏదైనా చేస్తాం.. ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొడతాం.. అంటూ రెచ్చిపోతే చూస్తూ ఊరుకోమన్నారు. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ సంకల్పమన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చలన్నదే వారి కుట్ర
► రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేస్తోంది. యాత్రకు సంఘీభావం తెలిపిన వారంతా ఒకే సామాజిక వర్గం వారు. ఈ విషయం మంగళవారం నాటి ఈనాడు పత్రికే రాసింది. దీన్ని బట్టి ఈ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారన్నది అర్థమవుతోంది. కేవలం పెట్టుబడిదారుల కోసమే ఈ యాత్ర సాగుతోంది.
► రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు లేదా? 2018 ఫిబ్రవరి 23న బీజేపీ చేసిన రాయలసీమ డిక్లరేషన్‌లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారా.. లేదా? ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చాలని చంద్రబాబు చేస్తున్న యత్నాలకు వీరంతా ఎందుకు మద్దతిస్తున్నారు?  

దేవుడిని ఏం కోరుకుంటారు?
► మా ప్రాంతానికి వచ్చి మేము కొలిచే అరసవల్లిలో దేవుడికి మొక్కి మాకు కీడు జరగాలని, ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలని మీరు కోరుతారా? అటువంటి సంకల్పంతో చేస్తున్న ఈ యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు సహించరు. ఈ యాత్రపై ఏదైనా తిరుగుబాటు జరిగితే చంద్రబాబుదే బాధ్యత. 

ఉత్తరాంధ్రకు బాబు ద్రోహం
► 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న బాబు రాష్ట్రానికి ఏం మేలు చేశారు? 1983 నుంచి జరిగిన  ఎన్నికల్లో టీడీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు అండగా నిలిచినా  ఈ ప్రాంతానికి ఎందుకు ద్రోహం చేయాలని భావిస్తున్నారు? చంద్రబాబుతో కలిసి మిగతా పార్టీల కుట్రలనూ ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారు. అవినీతితో చంద్రబాబు సంపాదించుకున్న రూ.లక్షల కోట్లను పదిలంగా ఉంచుకోవడమే లక్ష్యంగా బాబు ఈ యాత్ర చేయిస్తున్నారు.

► ‘రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయ్, రాష్ట్రమంటే 26 జిల్లాలోయ్‌..’ అని చంద్రబాబు గుర్తెరగాలి. 2024లో రాజధాని అంశానికి ముగింపు పడుతుంది. ప్రజలే స్పష్టమైన తీర్పు చెబుతారు. విశాఖలో ప్రభుత్వ భవనాలు నిర్మించడం కూడా తప్పా? ప్రజలు అంతా గమనిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top