
సాక్షి, విశాఖపట్నం: లోకేష్ ఎన్టీఆర్ వారసుడు కాదని.. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తికి వారసుడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహానికి దండలు వేసినంత మాత్రాన ఆయన వారసులైపోరని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం తండ్రీ కొడుకులు భువనేశ్వరినే వాడుకున్నారంటే.. ఇంతకన్నా దిగజారుడు నాయకులుండరని అన్నారు.
అమర్‌నాథ్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మీద అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు నోటీసు ఇవ్వడానికి వస్తే అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. అయ్యన్నని అరెస్ట్ చేస్తే టీడీపీ హయాంలో ఆయనతో పాటు బాబు చేసిన గంజాయి అక్రమ లావాదేవీలు బయటపడతాయన్న భయంతో లోకేష్ దాన్ని రాజకీయం చేయాలనే విశాఖకి వచ్చాడన్నారు.
టీడీపీకి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయగలదా అని సవాల్ విసిరారు. బాలయోగి, మాధవరెడ్డి మరణంలో చంద్రబాబు పాత్ర ఉందేమోనన్న అనుమానం ప్రజలకు ఉందన్నారు. చచ్చిన పాములాంటి బండారు సత్యనారాయణమూర్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమరనాథ్ అన్నారు.