ఓటర్లకు అఫిడవిట్‌ కాపీలు; కేజ్రీవాల్‌ వెరైటీ ప్రచారం

Goa Assembly Election 2022: AAP Candidates Sign Affidavits Promising No Corruption, Defection - Sakshi

నిజాయితీగా ఉంటామని అభ్యర్థులతో అఫిడవిట్‌లు

పార్టీకి విశ్వాసంగా ఉంటామని ప్రతిజ్ఞ

పణజి: విలక్షణ ఆలోచనలు, విభిన్న పోకడలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)  గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. గోవా మెరుగైన భవిష్యత్తు కోసం తమ పార్టీకి ఓటు వేయాలని బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలను ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్ కోరారు. ‘బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు ఆప్‌లో చేరేందుకు తమ పార్టీలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు, గోవా భవిష్యత్తు కోసం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుకు ఓటు వేయండి. దయచేసి ఈసారికి మీ పార్టీని మరచిపోండి’ అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే నిజాయితీగా పనిచేస్తామని ‘ఆప్‌’ అభ్యర్థులతో అఫిడవిట్‌లపై సంతకాలు చేయించారు కేజ్రీవాల్‌. అంతేకాదు గెలిచిన తర్వాత పార్టీ ఫిరాంచబోమని, ‘ఆప్‌’నకు విశ్వాసపాత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్‌ సమక్షంలో గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు. (క్లిక్‌: అన్నయ్యతో అవ్వట్లేదు... చెల్లెలి అలుపెరుగని పోరాటం)

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులందరూ నిజాయితీపరులే. అయితే వీరంతా నిజాయితీపరులని ఓటర్లు నిర్ధారించేందుకు ఈ అఫిడవిట్‌లు అవసరం. మా అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంతకం చేసిన అఫిడవిట్ కాపీని పంపిణీ చేస్తారు. అలా చేయడం ద్వారా, మా అభ్యర్థులు అఫిడవిట్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై విశ్వాస ఉల్లంఘన దావా వేసే అధికారాన్ని మేము ఓటర్లకు అందిస్తున్నాం. ఎ‍న్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేపథ్యాలను పరిశీలించేందుకు ప్రతి ఒక్కరికీ అనుమతి ఉంది. గోవా ప్రజల నమ్మకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ వమ్ము చేయద’ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. (చదవండి: బీజేపీకి తప్పని తిరుగుబాట్ల తలనొప్పి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top