ట్రంప్‌ టూర్‌ గొడవలతో పరువు పోయింది | GHMC Eletions 2020 : Minister KTR Fires On BJP | Sakshi
Sakshi News home page

పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్‌ను పెట్టడమే: కేటీఆర్‌

Nov 30 2020 8:28 AM | Updated on Nov 30 2020 8:28 AM

GHMC Eletions 2020 : Minister KTR Fires On BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగడాన్ని అమెరికా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయని, దీంతో అంతర్జాతీయంగా ఢిల్లీ బ్రాండ్‌ దెబ్బతిన్నదని, ఇప్పుడదే మాదిరిగా హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారా? అని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ బీజేపీ నేతలను ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నివసించే ఢిల్లీలోనే ఇలా జరిగిందంటే ఎలా అని ఆయన మండిపడ్డారు. ఆదివారం నగరంలోని పలుచోట్ల రోడ్‌ షోలు నిర్వహించిన కేటీఆర్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు.

ఐటీఐఆర్‌ రద్దుతో యువత నోట్లో మట్టి.. 
అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు..అన్నట్లుగా బీజేపీ వ్యహరిస్తుందని, ఆ పార్టీ ఏమీ చేయదు..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుకుంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బేగంపేట పాటిగడ్డ చౌరస్తాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన అమిత్‌షా.. ఐటీఐఆర్‌ను రద్దు చేసింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. తెలంగాణలో ఉన్నది నిజాం సంస్కృతి కాదు...1920లోనే మహాత్మాగాంధీ మెచ్చిన సామరస్యత ఉందని చెప్పారు. ఆరేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదన్నారు. బీజేపీలో ఉన్నవారికి విషయం లేదని, వారికి ఉన్నదల్లా విషమేనన్నారు. హైదరాబాద్‌లో కలసి ఉండేవారి మధ్య చిచ్చుపెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఒకరేమో బైక్‌ పోతే బైక్, కారు పోతే కారు ఇస్తామని చెబుతారని, దానికి ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారని ఓ విలేకరి అడిగితే ఇన్సూరెన్స్‌తో ఇస్తానని చెప్పడం చూస్తుంటే ఆ వ్యక్తి ఇన్సూరెన్స్‌ ఏజెంటా? లేక పార్టీ ప్రెసిడెంటా? అని ప్రశ్నించారు. బీజేపికి ఓటు వేయడమంటే పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్‌ను పెట్టడమేనన్నారు.  

ఆడబిడ్డకు అన్యాయం చేసినోళ్లు ఎవరు? 
ఉత్తరప్రదేశ్‌ నుంచి ఒకరొచ్చారు..ఆ రాష్ట్రంలో ఆడ పిల్లలపై అఘాయిత్యం జరిగితే అక్కడ ప్రభుత్వం ఏమి చేసిందో చూశాం..ఇక్కడ ఆడ బిడ్డకు అన్యాయం జరిగితే ఏడాది క్రితం ఏమి జరిగిందో చూశామన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు తెస్తామని చెప్పింది, ఈ లెక్కన ఆరేళ్ళలో 12 కోట్ల ఉద్యోగాలు రావాలన్నారు. కొత్త ఉద్యోగాలు ఏమో గానీ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రేఖానాయక్, సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని కార్పొరేటర్‌ అభ్యర్ధులు కొలను లక్ష్మి, శేషుకుమారి, మహేశ్వరి, అరుణగౌడ్, ఆకుల రూప, హేమలత తదితరులు పాల్గొన్నారు. 

డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ కావాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటేయాలి...  
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపిస్తేనే డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ సాధ్యమౌతుందని బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పారని,  ప్రధాని మాదిరే తాము చెబుతున్నామని..రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ కావాలంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ నగరవాసులను కోరారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోషామహల్‌ నియోజకవర్గం జుమ్మెరాత్‌ బజార్‌లో రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమంలో అభ్యర్థులు పూజ వ్యాస్‌ బిలాల్, ఎం.ఆనంద్‌కుమార్‌ గౌడ్, పరమేశ్వరీ సింగ్, మమతా గుప్తా, ముఖేష్‌ సింగ్, రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ పాల్గొన్నారు. 

రూపాయి కడితే ఆఠాణా ఇచ్చారు 
గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పన్నుల రూపంలో 2 లక్షల 72 వేల కోట్లు చెల్లిస్తే...కేంద్రం రాష్ట్రానికి కేవలం లక్షా 40 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని..అంటే రూపాయి మనం ఇస్తే వారు ఇచ్చింది ఆఠాణా అని మంత్రి కేటీఆర్‌ దుయ్యబట్టారు. ఆదివారం తార్నాక డివిజన్‌లోని శాంతినగర్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్డు షోలో మాట్లాడారు. సింహం సింగిల్‌గా వస్తుంది..పందులు గుంపుగా వస్తాయని అన్నారు. కార్యక్రమంలో మోతే శోభన్‌రెడ్డి, రామేశ్వర్‌గౌడ్, కుమార్‌ వంశరాజ్, మల్లికార్జున్,  వేణుగోపాల్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement