‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’ | Ex Minister Kurasala Kannababu Fires On Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’

Jun 17 2026 7:34 PM | Updated on Jun 17 2026 7:49 PM

Ex Minister Kurasala Kannababu Fires On Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్‌ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికే ఆయన సవాల్‌ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 పై లోకేష్‌ సవాల్‌ని వైఎస్సార్సీపీ స్వీకరిస్తుందని.. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, మా వెంట దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని చెప్పారు.

డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్‌ జగన్‌ ఆధారాలతో సహా బయట పెడితే ఇంతవరకు నారా లోకేష్‌ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారికి చెప్పి నమ్మించాలని సవాల్‌ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదనేది నిజమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా అని ప్రశ్నించారు.

కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌ డెత్‌ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం, ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్‌ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్‌కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపుకోతకు లేదా అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గురువారం (18వ తేదీ) శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు గవర్నర్‌ని కలిసి డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నట్టు చెప్పారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:

దమ్ముంటే డీఎస్సీ నిర్వహణపై మాట్లాడు లోకేష్‌:
డీఎస్సీ–2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైఎస్‌ జగన్‌ చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా సవాల్‌ విసిరి పారిపోయాడు. ప్లేస్‌ ఆయన చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, డీఎస్సీ పై బహిరంగ చర్చకు మేం సిద్ధమే. మాతోపాటు దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తాం. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే సరికాదు. డీఎస్సీ నిర్వహణలో తప్పే జరగలేదనుకుంటే మేం అడిగినట్టు సీబీఐ విచారణ కోరాలి.

సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వయిరీ అని మాత్రం అనుకోవద్దు. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో విర్రవీగిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కవ్వింపు చర్యలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే 200 మీటర్ల దూరంలో ఉన్నానని నారా లోకేష్‌ ఛాలెంజ్‌. స్పోర్ట్స్‌ కోటాలో అడ్డదారిలో ఉద్యోగాలిచ్చిందే కాకుండా ఎన్ని జన్మలెత్తినా మీరు డీఎస్సీ నిర్వహించలేరని వాగడం సిగ్గుమాలినతనం తప్ప మరోటి కాదు.

సొంత ఛానెళ్లలో తొడలు కొట్టడం, భజన చేయంచుకోవడం కాదు:
పరీక్ష నిర్వహణలో ఉద్దేశపూర్వకంగానే కాంప్రమైజ్‌ అయ్యారని పలు విధాలుగా ఆధారాలతో వైఎస్‌ జగన్‌ నిరూపించారు. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించే వరకు పారదర్శకత లేదని జీవొలతో సహా నిరూపించారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కి పిలిచి సెలెక్ట్‌ అయ్యారని పంపిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్ష కూడా రాయకుండా డిగ్రీ ఉత్తీర్ణత కావాల్సిన అవసరమే లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలిచ్చారని తేలింది.

ఇవన్నీ కాదని నిరూపించండి చూద్దాం. ఇంతపెద్ద స్కామ్‌ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు?  కొంతమంది అధికారులను పంపించి  మాట్లాడించడమే తప్ప, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఎందుకు భయపడిపోతున్నాడు?  టీచర్‌ పోస్టులు వచ్చిన వారిని భయపెట్టి పిలిచి, టీడీపీ నాయకుల సమక్షంలో వైఎస్‌ జగన్‌ని తిట్టించడం కాదు. దమ్ముంటే, మెరిట్‌ ఉన్నా ఉద్యోగం రాలేదని కోర్టులు చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులతో మీటింగ్‌ పెట్టండి. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు. తప్పు జరగలేదని వారిని ఒప్పించండి. సొంత ఛానెల్‌లో తొడలు కొట్టించుకోవడం కాదు.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు.

లోకేష్‌ని మందలించే ధైర్యం చంద్రబాబుకే లేదు:
బెంగళూరులో కాపురం ఉంటాడని జగన్‌ని విమర్శించడం కాదు.. నారా లోకేష్‌ ఎక్కడ కాపురం ఉంటున్నాడు. వీకెండ్‌ వస్తే ఎక్కడుంటున్నాడు. తెలంగాణలో ఆధార్‌ కార్డు పెట్టుకుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే ఎలా? 2019–24 ఎప్పుడైనా లోకేష్‌ ఆంధ్రాలో ఉన్నాడా?  ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబుకి లేదా? లేక ఆయన్ను నోరెత్తనీయకుండా లోకేష్‌ అడ్డుకుంటున్నాడా?  డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగిన ఈ సందర్భంలో ఒకవేళ నారా లోకేష్‌ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మరెవరైనా ఉండుంటే.. వారిపై చంద్రబాబు సీరియస్‌ అని ఎల్లో మీడియాలో హెడ్‌లైన్స్‌ వచ్చి ఉండేవి.

విద్యాశాఖ మంత్రిని త్వరలోనే మార్చేస్తున్నారని బ్రేకింగ్‌లు వేసేవాళ్లు. కానీ లోకేష్‌ని పిలిచి మందలించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. డీఎస్సీపై చర్చకు ఏ ఛానెల్‌కి రమ్మన్నా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చకుండా వదిలిపెట్టం. వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌ లెస్‌ గా వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, కేసులకు భయపడటం అనేది జరగదు.

గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తాం:
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు గురువారం (18వ తేదీ) గవర్నర్‌ని కలిసి డీఎస్సీ నిర్వహణపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారు. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు అన్యాయంగా లాకప్‌లో చంపేశారని లాకప్‌ డెత్‌ గురించి రాష్ట్రమంతా చర్చిస్తుంటే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం, ఎల్లో మీడియా మేకప్‌ మీద చర్చిస్తోంది.

రాజధానిలో శాంతిభద్రతలు గాడితప్పి ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా మేకప్‌ పేరుతో డైవర్షన్‌ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. తన బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటే దాన్ని పక్కనపెట్టి మేకప్‌ ఉద్యమం చేపట్టారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ కమిషనర్‌ ఎక్కడున్నారు?. అసలు లాకప్‌ డెత్‌ జరగలేదని చెప్పై ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదా? మహిళల గురించి లోకేష్‌ ఎంత నీచంగా మాట్లాడిన మాటలన్నీ తీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు?

ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే రాష్ట్ర ప్రజలు వినాలా?  సాయికృష్ణ తల్లి కూడా మహిళ కాదా? ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్‌కి ఇచ్చిన విలువ సాయికృష్ణ తల్లి కడుపుకోతకు ఇవ్వలేదా?  సాయికృష్ణ ఆచూకీ గురించి తల్లి రోదిస్తుంటే రౌడీ షీటర్‌ అని ప్రచారం చేస్తున్నారు. రౌడీ షీటర్‌ అయితే చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement