
సాక్షి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జీడీనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే మా పార్టీకి చెందిన నాయకుల్ని, మచ్చలేని రిటైర్డ్ అయిన అధికారులను కూడా అరెస్టు చేసి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్ర పన్ని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను.
'నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు' అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా ఎల్లో మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.
నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ ఎల్లో మీడియా రాస్తుంది. వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.
ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదు
నాకు ల్యాప్‌టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడం కూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్‌ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్‌ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడతాడు?
అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో వస్తున్న సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు, విచ్చలవిడి విక్రయాల కారణంగా వస్తున్న సామాజిక సమస్యలు, మహిళల భద్రత, వారికి రక్షణ తదితర అంశాలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కాగానే లిక్కర్ వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టిపెట్టాం. లాభాపేక్ష ఉన్న ప్రైవేటు వ్యాపారుల వల్ల విక్రయాలు, వేళల్లో నియంత్రణ లేకపోవడం, మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడ్డం, వీధికో బెల్టుషాపులు పెట్టి మద్యాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం… ఇవన్నీ చూసిన తర్వాత వీటికి కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టాం. వేళల్ని నియంత్రిస్తూ, లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. మాఫియాకు అడ్డుకట్ట వేశాం.
పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాం
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులువేశాం. ఆవిధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యంత పారదర్శరకంగా మద్యం పాలసీని అమలు చేయడం వల్ల, లిక్కర్ వినియోగం తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014-19తో పోలిస్తే పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ వద్దే ఉన్నాయి.
ఇంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే, మాపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మద్యం దుకాణాలనే ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, లాభాపేక్ష లేకుండా వాటిని నడుపుతున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు పులిస్టాఫ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మా హయాంలో అమ్మకాలు తగ్గితే, చంద్రబాబు హయాంలో పెరిగాయి.
మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మేం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితే, చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. వాళ్లంతా మాఫియాలా ఏర్పడి దోచుకున్నారు. విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మా హయంలో అమ్మకం వేళలు తగ్గించాం. చంద్రబాబుగారు రాత్రీ పగలూ లేకుండా అమ్మించారు.
చంద్రబాబు హయాంలోనే మద్యం అవినీతి
మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మేం దుకాణాలు తగ్గించాం. కాని చంద్రబాబు విచ్చలవిడిగాద మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్స్ పెట్టాడు. దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? మేం 43 వేల బెల్టుషాపులు రద్దుచేశాం. వీధి వీధికీ చంద్రబాబు బెల్టుషాపులు పెట్టాడు. ఆలయాల వద్దా, స్కూళ్ల వద్దా ఇలా ప్రతి చోటా బెల్టు షాపులు పెట్టాడు. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు హయాంలో పూర్తి వివక్ష పాటించాడు.
అస్మదీయులైన తనవాళ్లకే ఆర్డర్లు ఇచ్చాడు. మరి ఎవరిది అవినీతి?. ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలువస్తాయా? రాష్ట్రంలో ఉన్న డిస్టరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. మేం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరిది అవినీతి.
అన్నిటికీ మించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిమీద మా ప్రభుత్వం హయాంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో చంద్రబాబు ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని మరుగున పరచడానికి, తాను అవలంబించిన తప్పుడు విధానాలు సరైనవే అని చెప్పుకోవడానికి, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేం వివక్షకు పాల్పడుతున్నామని ఆరోపిస్తూ అప్పట్లోనే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కంపెనీలు వెళ్లాయి. ఆ కేసును కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. మా పారదర్శకతకు ఇది నిదర్శనం. అయినా మాపై బురదజల్లుతూనే ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలోనూ అదే దోపిడీ
ఇవాళ మంచి ప్రభుత్వం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పూర్తిగా అవినీతి మయం. ఇష్టానుసారం దోచుకుంటున్నారు. విలచ్చవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. తెల్లవారు జాము మొదలుకుని మళ్లీ తెల్లవారుజాము వరకూ మందు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు పెట్టి అమ్ముతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు పెడుతున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం మాఫియా మయమే. వేల కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. కింద నుంచి పై స్థాయివరకూ ఈ లంచం సొమ్ము చేరుతుంది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతటి అవినీతి చూడలేదు. పైగా ఈ అవినీతి బాగోతానికి మంచి పాలసీ అని ముద్రవేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..
ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్‌గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు. నా ఇంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు సిట్ అధికారులు లెక్కించి తీసుకుపోయారంటూ ఎలా ఎల్లో మీడియాలో స్క్రోలింగ్‌లు వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారని రాశారు. ఇది సమంజసమా?. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లలోనూ కోతలు పెడుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనిలో కేవలం అయిదు కేటగిరిలకే ఎందుకు పరిమితం చేశారు? వీటిపై మాట్లాడితే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వేధిస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ వద్ద సమస్యలపై వెళ్ళినా ఏ పార్టీ అని రాస్తున్నారు