శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని ప్రతీ ప్రాజెక్ట్ తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనతేనన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది శూన్యమని అప్పలరాజు విమర్శించారు. నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఉత్తరాంధ్రాకు ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చెత్త సంపద కేంద్రం ప్రారంభించటానికి ముఖ్యమంత్రి జిల్లాకి రావాలా? అని ప్రశ్నించారు.
‘ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మూడోసారి జిల్లాకు వచ్చారు. ఒకసారి ఇచ్చాపురం వచ్చిన చంద్రబాబు టీ పెట్టటం నేర్పించారు. రెండోసారి బుడగట్ల పాలెం వచ్చినప్పుడు హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయాడు. మూడోసారి పర్యటనలోచెత్త సంపద కేంద్రం తీసుకువచ్చారు. చంద్రబాబుకు ఈ జిల్లాపై ఉన్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లం అయింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. మీకు శ్రీకాకుళం జిల్లా అంటే ఇంత చిన్న చూపా.
పిల్లలు భారం కాదు....వాళ్లే మీ సంపద అంటున్నారు. పేదలకు ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారు. మీ అబ్బాయికి ఆ సలహా ఇవ్వండి. మీరెందుకు ఒక్కరితో ఆగిపోయారు. ఇద్దరిని, ముగ్గురిని ఎందుకు కనలేదు. నేటి చంద్రబాబు టీడీపీకి ఒకప్పటి టీడీపీకి చాలా తేడా ఉంది. వైఎస్సార్ ఆశయ సాధన కోసం, ప్రజలకు సేవ చేయాలనే ఆవిర్భవించిన దమ్మున్న పార్టీ వైఎస్సార్‌సీపీ. మా పార్టీతో మీ పార్టీకి పోలికా?’ అని మండిపడ్డారు.
దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధర గుంటూరులో ఉంది. ఇది మన ఏపీ ఘనత. ఆ రోజు పెట్రోల్ ధర ఎక్కువ ఉంటే జగన్ వైఫల్యం అట. ఈరోజు పెట్రోల్ ధర పెరిగితే చంద్రబాబుకు సంబంధం లేదట. పెట్రోల్ పై రాష్ట్రంలో అదనంగా రూ 4 వ్యాట్ వేసారు. దాన్ని తగ్గించండి. అమరావతి కోసం డీజిల్ తరలిస్తే ఎంతగా కొరత వచ్చిందో చూసాం...కేంద్ర అలా కుదరదని చివాట్లు పెడితే ప్రజలకు పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చింది. అమరావతిలో అంతులేని అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడరు. స్కూల్స్ కోసం దాతల నుండి విరాళాలు అడుగుతున్నారు. అతని కుమారుడే విద్యాశాఖ మంత్రి. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు.
రీ సర్వే వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆ రోజు ఏం మాట్లాడారు. మీ భూములు లాక్కుంటారు, మేం వచ్చిన వెంటనే రీ సర్వే రద్దు చేస్తాం మిమ్మల్ని బెదిరించడానికే జగన్ రీ సర్వే చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడటం వాస్తవం కాదా?
రీ సర్వేలో అసలు మీ పాత్ర ఏంటి? ఒక్క ఎక్విప్ మెంట్ అయిన మీరు కొన్నారా?, రీ సర్వే ఘనతను వాళ్ళ ఖాతాలో చేర్చుకోవడానికి మాట్లాడుతున్నారు చంద్రబాబు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రావడంలో ఎవరు ఎక్కువ రోల్ చేసారు చంద్రబాబు చెప్పాలి. మీరు మాట్లాడే ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే.
నేరేడు బ్యారేజ్ పై ట్రిబ్యునల్ తీర్పు 2021 లో జగన్ అధికారంలో ఉండగా వచ్చింది. నేరేడు బ్యారేజ్ పై ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడిన ఘనత జగన్‌ది. అందులో మీ ఘనత ఏముంది. అందులో నీ ఘనత ఏంటి? రామ్మోహన్ నాయుడు పాత్ర ఏంటి. గెజిట్ నోటిఫికేషన్ మొన్న చేశారు. ఇది ఒక పొలిటికల్ స్టంట్. మీరు నాలుగుసార్లు సీఎంగా చేసిన సమయంలో ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా.. దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకులు చెప్పoడి’ అని సవాల్ చేశారు.


