క్యాండిడేట్స్‌ కావాలి తమ్ముళ్లూ! | Sakshi
Sakshi News home page

క్యాండిడేట్స్‌ కావాలి తమ్ముళ్లూ!

Published Sun, Dec 31 2023 5:35 AM

DP chief Chandrababu troubles for the candidates - Sakshi

సాక్షి, అమరావతి : ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి... ఎల్లో మీడియాలో ఎన్ని అబద్దాలు అచ్చేస్తున్నా అసలు పరిస్థితి తెలిసిన తెలుగుదేశం నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. ఎన్నికల బరిలో నిలిపేందుకు అభ్యర్థులు దొరక్క టీడీపీ అధినేత నారా చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికీ చాలాచోట్ల తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు. చంద్రబాబుపై అప నమ్మకం, టీడీపీ పైకి లేవడం కష్టమని గుర్తించిన టీడీపీ ముఖ్య నేతలు స్తబ్దుగా ఉంటున్నారు. గెలవాలంటే మనం భారీగా ఖర్చు పెట్టాలని చంద్రబాబు చెబుతుండడంతో మాజీలు జంకుతున్నారు.

ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకి రూ.25  కోట్లు, ఎంపీ సీటు అయితే రూ.50 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చంద్రబాబు తన సమీప నేతలతో స్పష్టంగా చెబుతున్నట్లు తెలిసింది. చంద్రబాబు డబ్బు వ్యూహం, క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితుల్ని చూసి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐలు, బాగా డబ్బున్న వాళ్లతో మాట్లాడి అభ్యర్థులుగా ఖరారు చేయాలని చంద్రబాబు తన కోటరీలోని నేతలను పురమాయించినట్లు తెలిసింది. చాలా మందితో సంప్రదిస్తున్నామని, ఎవరూ ముందుకు రావడంలేదని నేతలు వాపోతున్నారు. అమెరికా వెళ్లి క్యాంపెయిన్‌ చేసి వచ్చినా పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని వారు పేర్కొంటున్నారు. 

సిట్టింగ్‌ ఎంపీ స్థానాల్లోనూ గందరగోళం 
టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ స్థానాలైన గుంటూరు, విజయవాడలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇద్దరు సిట్టింగ్‌లు గల్లా జయదేవ్, కేశినేని నాని మళ్లీ పోటీ చేసేది లేదని తేల్చేశారు. గల్లా జయదేవ్‌ అయితే తాను ఎంపీననే విషయాన్నే మరచిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన స్థానంలో ఎవరిని ఎంపీగా పోటీ చేయించాలనే దానిపై చంద్రబాబు ఎంత కసరత్తు చేసినా దారి కనిపించడంలేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కొందరు సీనియర్లను పిలిచి గుంటూరు ఎంపీ సీటు ఇస్తానని చెప్పినా చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో ఎవరైనా పారిశ్రామికవేత్తను రంగంలోకి దించాలనే యోచనలో చంద్రబాబు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ స్థానానికి రూ.50 కోట్లు పెట్టాలని చంద్రబాబు చెబుతుండడంతో ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ను రేసులోకి తీసుకువచ్చారు. 

చంద్రబాబు, లోకేశ్‌ చెబుతున్న ఎన్నికల ఖర్చు గురించి విని ఆయన కూడా భయపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి శివనాథ్‌కి ఎంపీ సీటు ఇస్తామని చెబుతున్నా ఆయన కంటె ఎక్కువ ఖర్చు పెట్టే భ్యర్థి దొరుకుతారా అని చంద్రబాబు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

 గుడివాడలో ఎన్‌ఆర్‌ఐ  
విజయవాడ పశి్చమ నియోజకవర్గానికి ఇప్పటికీ టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఆ పార్టీ సిట్టింగ్‌ స్థానమైన విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్‌ కూడా రూ.50 కోట్ల ఖర్చు గురించి భయపడుతుండడంతో మరో అభ్యర్థి కోసం లోకేశ్‌ చూస్తున్నారనే ప్రచారం ఆ పార్టీలోనే జరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ సీటును ఇదే తరహాలో బేరం పెట్టి పార్టీలో మొదటి నుంచి ఉన్న రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి ఎన్‌ఆర్‌ఐ వెనిగళ్ల రాముకి ఖరారు చేశారు.

రాము బాగా ఖర్చు చేయడానికి ముందుకు రావడంతో ఆయన్ను ఇన్‌చార్జిగా ప్రకటించారని నేతలు చర్చించుకుంటున్నారు. గన్నవరంలోనూ వైఎస్సార్‌సీపీ వదిలించుకున్న యార్లగడ్డ వెంకట్రావుతో బేరం కుదుర్చుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బీజేపీ నుంచి వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణను తీసుకువచ్చి ఇన్‌ఛార్జిగా ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను వైఎస్సాఆర్‌సీపీ కాదనుకుంటే టీడీపీ చేర్చుకుంది.

ఇలా చాలాచోట్ల వైఎస్సార్‌సీపీ వదిలించుకున్న వారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే టీడీపీకి దిక్కవుతున్నారు. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలోనూ ఆ పార్టీ అభ్యర్థుల కోసం ఇబ్బందులు పడుతోంది. పోలవరం, కొవ్వూరు, నర్సాపురం, గోపాలపురం వంటి చోట్ల టీడీపీ అభ్యర్థుల కోసం వెతుకులాడుతోంది. ఏలూరు ఎంపీ స్థానంలో ఎవరిని బరిలో నిలపాలనేది టీడీపీకి కష్టంగా మారింది. తూర్పుగోదావరిలోనూ పలుచోట్ల సరైన నేతలు లేక పక్క పార్టీల నేతల వైపు చూస్తున్నారు.  

కుప్పంలో ఈదలేక... 
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. స్వయంగా చంద్రబాబే కుప్పంలో ఎదురీదుతున్నారు. కుప్పంలో గెలవడం అనుమానంగా మారడంతో చంద్రబాబు ఈసారి రెండవ స్థానంలో పోటీ చేయడానికి కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆయన తనయుడు లోకేష్‌ గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయి అభాసుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తానని చెబుతున్నా సురక్షితమైన సీటు కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో ఓటమి ఖాయమనే భయంతో వేరే సీటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇలా ప్రతిచోటా తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొంది.    

Advertisement
 
Advertisement