షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు.. ‘వై’ కేటగిరి భద్రత ఏర్పాటు!

A dozen Shiv Sena MPs are in Touch with Eknath Shinde - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని రెబల్‌ వర్గంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఉద్ధవ్‌ థాక్రేను కాదని పలువురు శివసేన ఎంపీలు సైతం రెబల్‌ వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పది మందికిపైగా శివసేన ఎంపీలు ఎక్‌నాథ్‌ షిండేతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారు లోక్‌సభలో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దిల్లీ పెద్దలతో ఎక్‌నాథ్‌ షిండే చర్చలు చేపట్టిన క్రమంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్పీకర్‌కు లేఖ.. 
ముంబయి సౌత్‌ సెంట్రల్‌ ఎంపీ రాహుల్ షేవాలే నేతృత్వంలో ప్రత్యేక శివసేన బృందం ఏర్పాటు చేయాలంటూ సోమవారం రాత్రి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు పలువురు ఎంపీలు. ఆ బృందం చీఫ్‌ విఫ్‌ను సైతం నియమించింది. ఆ బాధ్యతలను యావత్మాల్‌ ఎంపీ భవన గావ్లీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆమెను చీఫ్‌ విప్‌ పదవి నుంచి తొలగించారు ఉద్ధవ్‌ థాక్రే. అయితే.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్‌నాథ్‌ షిండేతో సోమవారం వర్చువల్‌ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్‌ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. 

గత వారం పార్టీ ఎంపీలతో సమావేశమైన ఉద్ధవ్‌ థాక్రే.. తమ భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు తెంచుకుని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మూకు మద్దతు ప్రకటించారు. దీంతో థాక్రేపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. థాక్రే బంధీఅయ్యారని, ఆయనకు ఎంపీల డిమాండ్‌ను అంగీకరించటం తప్ప ఎలాంటి అవకాశం లేదని ఆరోపించాయి. మరోవైపు.. పలు కేసులపై సుప్రీం కోర్టు తీర్పు కోసం ఇరు వర్గాలు వేచి ఉన్నాయి. 

ఇదీ చదవండి: Uddhav Thackeray: ఉద్ధవ్‌ థాక్రేకు ఊహించని షాక్.. ‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top