ఢిల్లీలో ఢిపరెంట్‌ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా? | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో నయా రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?

Published Thu, May 23 2024 11:33 AM

Different Style Political Campaign At Delhi For Lok Sabha Election

బహుళ భాషలు.. బహుళ నేతలు.. ఢిల్లీలో విభిన్న  ప్రచారం

అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లుండ‌డంతో భిన్న రాష్ట్రాల సీఎంలను, నేతలను దింపిన ప్రచారంలోకి దింపిన పార్టీలు

రాజ‌స్థాన్ సీఎం భ‌జ‌న్ లాల్ శ‌ర్మ‌, ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ ధామిల‌తో బీజేపీ విస్తృత ప్ర‌చారం

ఆప్ నుంచి పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మ‌న్‌, కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్ల‌ట్, స‌చిన్ పైలెట్ ప్ర‌చారం

ఢిల్లీలో అధిక సంఖ్య‌లో రాజ‌స్థాన్‌, యూపీ, ఉత్త‌రాఖండ్‌, బీహ‌ర్ ప్ర‌జ‌లు

ప‌రిమిత సంఖ్య‌లోనే ద‌క్షిణాది ప్ర‌జ‌లు, 

ప్రాంతీయ మాండ‌లికాల‌లో క‌నెక్ట్ అయ్యి ఓట‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు

దేశ‌రాజ‌ధానిలో కొత్త కొత్త ప్ర‌చార వ్యూహాలు

బహుళ భాషలు, బహుళ ప్రాంతాల్లో ప్రజలున్న ఢిల్లీలో విభిన్న రీతుల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మినీ ఇండియాలాంటి ఢిల్లీని ద‌క్కించుకునేందుకు బీజేపీ, ఇండియా కూట‌మి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ కోసం బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది.

బీజేపీ ఏకంగా వివిధ రాష్ట్రాల సీఎంల‌ను ఎన్నిక‌ల ప్ర‌చార రంగంలోకి దింపింది. అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు నివ‌సిస్తున్న దేశ‌రాజ‌ధానిలో ఆయా ప్రాంతాల‌కు సీఎంల‌ను పంపుతూ ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. క్యాపిటల్‌లో ఓట్లు క్యాష్ చేసుకునేందుకు పార్టీలు డిఫ‌రెంట్ క్యాంపైన్  చేయ‌డ‌మే ఢిల్లీ ఎన్నిక‌ల ప్ర‌త్యేక‌త‌..

ఢిల్లీలో ఎన్నిక‌ల ప్ర‌చారం క్లైమాక్స్‌కు చేర‌డంతో చివ‌రి నిమిషం వ‌ర‌కు ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ, ఇండియా కూట‌మి అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగిసస్తున్నాయి. ఢిల్లీలో ప్రధానంగా యూపీ, బీహార్‌, ఉత్త‌రాఖండ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో నివ‌సిస్తుండ‌గా, ప‌రిమిత సంఖ్య‌లో ద‌క్షిణాది ప్ర‌జ‌లున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంల‌ను పార్టీలు రంగంలోకి దింపాయి.

రాజ‌స్థాన్ సీఎం భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ రాజ‌స్థాన్ ప్ర‌జ‌లు అత్య‌ధికంగా ఉన్న ప్రాంతాల్లో.. అలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌జ‌లు అధికంగా నివ‌సిస్తున్న ప్రాంతాల్లో సీఎం పుష్క‌ర్ ధామి విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఓపెన్ టాప్ జీపుల్లో అభ్య‌ర్థుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ త‌మ పార్టీకి మ‌ద్ద‌తివ్వాల‌ని అభ్య‌ర్థించారు. త‌మ త‌మ రాష్ట్రాల మాండ‌లికంలో మాట్లాడుతూ వారితో క‌నెక్ట్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు. రాష్ట్రాల‌లో తాము అందిస్తున్న ప‌థ‌కాలు, మోదీ గ్యారంటీలు ప్ర‌చారం చేశారు. దేశ‌వ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంద‌ని, ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయ‌మ‌ని వారు చెబుతున్నారు.

ఇటు బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా త‌మ ఇత‌ర రాష్ట్రాల నేత‌ల‌ను ప్ర‌చారంలోకి దింపాయి. రాజ‌స్థాన్ సీఎంగా ప‌నిచేసిన అశోక్ గెహ్ల‌ట్‌, స‌చిన్ పైల‌ట్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థ‌ల‌కు మ‌ద్ద‌తుగా ఢిల్లీలో ప్ర‌చారం నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్‌ల‌ను ఢిల్లీలోని రాజ‌స్థాన్‌వాసుల‌కు వివ‌రించారు. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌ సైతం ఆమ్‌ ఆద్మీ పార్టీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారంచేశారు. ఇటు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి మ‌ల్లు ర‌వి సైతం ఢిల్లీ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల‌ని అభ్యర్థించారు.

చోటా భార‌త్‌ను త‌ల‌పించే ఢిల్లీలో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం ఒక్క నాయ‌కుడి వ‌ల్లే అయ్యేది కాదు. అందుకే ఆయా రాష్ట్రాల‌, భాష‌ల ప్ర‌జ‌లు నివ‌సిస్తున్న ప్రాంతాల‌లో వారి భాష మాట్లాడే నాయ‌కుడిని పంపి త‌మ‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మ‌రి ఓట‌రు దేవుళ్లు ఎవ‌రిని క‌రుణిస్తారో.. ఏ భాష‌లో స‌మాధాన‌మిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement