
పాలమూరు ప్రజాదీవెన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో వంశీచంద్‌రెడ్డి
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారు
‘పాలమూరు ప్రజాదీవెన’ బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి
బీఆర్‌ఎస్, బీజేపీలవి దుర్మార్గపు రాజకీయాలు
మేం బాధ్యతతో వ్యవహరిస్తుంటే.. సన్నాసుల్లా విమర్శిస్తున్నారు
రాష్ట్రానికి సహకరించకపోతే కేంద్రానికి చాకిరేవు పెడతా..
రాష్ట్రంలో పదేళ్లూ మేమే అధికారంలో ఉంటాం.. మమ్మల్ని టచ్ చేస్తే.. మానవబాంబులై పేలుస్తాం
తమ 90 రోజుల పాలనపై రెఫరెండానికి సిద్ధమన్న రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ మూడు నెలలు, ఆరు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందంటూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏం అన్యాయం చేశామని కాంగ్రెస్ సర్కారును కూల్చుతామని అంటున్నారని నిలదీశారు. ఎవరినైనా ఎదుర్కొంటామని, తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో ఉంటుందని చెప్పారు. తమను టచ్ చేస్తే అగ్నికణికలై, మానవ బాంబులై పేలుస్తామని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్, బీజేపీల దుర్మార్గపు రాజకీయాలకు పాతరేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 90 రోజుల పాలనపై రెఫరెండానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల బీమా, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి చర్యలు తీసుకున్నాం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నాం. రైతు భరోసా కింద పెట్టుబడిసాయం అందించడంతోపాటు ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలను అందించాం.
పదేళ్లు అధికారంలో ఉంటాం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలే, ఆరు నెలలే ఉంటుందని కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారు. కేసీఆర్, మోదీలు పదేళ్లు అధికారంలో ఉండాలా? పేదల ప్రభుత్వాన్ని ఆరు నెలలు ఉండనీయరా? 40శాతం ఓట్లతో గెలిచిన ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతారా? రైతుబిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేరా? ఒకసారి టచ్ చేసి చూడండి.. మేం అగ్నికణికలై, మానవ బాంబులై పేల్చేస్తాం.
తమాషా చేస్తే పండబెట్టి తొక్కి పేగులు మెడకేసుకుని ఊరేగుతాం. నల్లమలలో పుట్టి తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చా.. ప్రగతిభవన్ కంచెలు బద్దలుకొట్టి బజారుకు ఈడ్చినోడిని. ఈ పాలమూరు బిడ్డకు తట్టా పార, వలసలే కాదు.. నీలాంటి వారిని బొందపెట్టడం కూడా తెలుసు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆన.. పాలమూరు బిడ్డగా మాటిస్తున్నా.. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు..
రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రికి మేం వినతులు ఇస్తే.. ఇక్కడి కొందరు సన్నాసులు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నరు. నేనేమీ మీలాగా ఇంట్లో తలుపులు మూసుకుని, కడుపులో తలకాయ, కాళ్లు పెట్టుకుని పడుకోలేదు. అతిథి సంస్కారంతో ముఖ్యమంత్రిగా బాధ్యత నెరవేర్చిన. రాష్ట్రానికి మేలు జరగాలన్న ఆలోచనతో ప్రధానికి సమస్యలు చెప్పిన. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం సమస్యలు తీర్చకపోతే చాకిరేవు కాడ బట్టలు ఉతికినట్టుగా వారిని ఉతికే బాధ్యత నాదే. కేంద్రం సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి కొట్లాడుతా..
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం..
రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది. దుష్ట పాలనలో పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దిగమింగారు. పాలమూరు–రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, సంగంబండ ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కట్టిస్తానని చెప్పిన కేసీఆర్.. తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడినపెడుతున్నాం. గత మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గంట అయినా ప్రజలకు దూరంగా ఉన్నామా? ఏం అన్యాయం చేశామని మోడీ, కేడీ మా ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడుతున్నారు? ఆరు అడుగులు ఉన్నామంటూ దూలంలా పెరిగిన కొందరికి ఆవుదూడకున్నపాటి బుద్ధి కూడా లేదు.
బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి. కేసీఆర్ తన కుమారుడు సీఎం కాకుండా రైతుబిడ్డ సీఎం అయ్యాడన్న అసూయతో మాట్లాడుతున్నారు. ఒంట్లో బాగాలేదన్నప్పుడు నల్లగొండకు ఏం కాసేందుకు వెళ్లారు? ప్రజలు ఓడించి బొక్కలు విరగ్గొడితే సిగ్గులేకుండా వీధుల్లో పడి కాంగ్రెస్‌ను తిడుతున్నారు.
ఎదిరించి నిలబడతాం..
దేశంలో మోదీనైనా, రాష్ట్రంలో కేడీనైనా ఎదురించి నిలబడుతాం. తొడగొట్టి పడగొట్టే ధైర్యాన్ని పాలమూరు బిడ్డలే నాకు ఇచ్చారు. పాలమూరు బాధలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు వేగంగా మంజూరయ్యేందుకు చర్యలు చేపడతాం. ప్రజలు రాష్ట్రంలోని 14 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి..’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.