CLP Leader Bhatti In The Meeting Of The Labor And Labor Congress - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్, బీజేపీలకు కార్మికలోకం బుద్ధి చెప్పాలి

Published Mon, Jul 24 2023 3:58 AM

CLP leader Bhatti in the meeting of the Labor and Labor Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఫ్యూడల్, కేంద్రంలోని కేపిటలిస్టు ప్రభుత్వాల కుట్రలో కార్మికులు పడొద్దని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం(సీఎల్పి) నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హక్కులను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు కార్మికలోకం సిద్ధం కావాలని కోరారు. ఆదివారం ఇక్కడి గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్‌ (కేకేసీ) రాష్ట్ర చైర్మన్‌ సమీర్‌ కౌశల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన రూ.10 వేల కోట్ల సెస్‌ నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి కార్మికులు గుణపాఠం చెప్పాలని భట్టి కోరారు. త్వరలో రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.

సమావేశం వేదికపైకి తమను ఆహ్వానించలేదంటూ ఐఎన్‌టీయూసీ నేతలు ఆందోళనకు దిగారు. వీరికి సర్దిచెప్పి సమావేశాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్, కేకేసీ చైర్మన్‌ డాక్టర్‌ ఉదిత్‌రాజ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రేను కార్మికనేతలు కలిసి వినతిపత్రం అందజేశారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement