ఆగస్టు 15 నుంచి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌

Clean Andhra Pradesh from August 15 - Sakshi

పరిశుభ్రతలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి బొత్స

సాక్షి ప్రతినిధి, విజయనగరం:  ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని, పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆగస్టు 15 నుంచి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయనగరం మునిసిపల్‌ కార్యాలయంలో రూ.1.48 కోట్లతో నిర్మించిన రెండు, మూడు అంతస్తులను సోమవారం ఆయన ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా వాటి పరిధిలోని ప్రతి ఇంటికీ మూడేసి చొప్పున డస్ట్‌ బిన్‌లను పంపిణీ చేస్తామని వివరించారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించడానికి వీలుగా అదనంగా 5 వేల కొత్త వాహనాలను సమకూరుస్తామని చెప్పారు. కాగా, పట్టణాలు, నగరాల్లో కొత్త ఆస్తి పన్ను విధానంపై ప్రతిపక్షం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని బొత్స విమర్శించారు. అవినీతికి చెక్‌ పెట్టేందుకే కొత్త పన్ను విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

అమరావతి దోషులను విడిచిపెట్టబోం
అమరావతి భూ అక్రమాల్లో దోషులను విడిచిపెట్టేది లేదని మంత్రి బొత్స తేల్చిచెప్పారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ పెద్దలు మాట మార్చారన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top