ప్రభుత్వ భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలి

Chinthala Ramachandra Reddy request to CM Jagan - Sakshi

ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్యే చింతల వినతి 

పీలేరు (చిత్తూరు జిల్లా): పీలేరు మండలంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పీలేరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పీలేరు మండలంలోని గూడరేవుపల్లె, దొడ్డిపల్లె, ఎర్రగుంట్లపల్లె, కాకులారంపల్లె, ముడుపులవేముల, బోడుమల్లువారిపల్లె పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లు వేసి అమాయకులైన ప్రజలకు విక్రయించారని పేర్కొన్నారు.

2009–2014 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో, 2014–2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా ఉన్న నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా 2019–21 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్లాట్లు వేసి అమ్ముకున్నారని టీడీపీ నాయకులు అభియోగాలు మోపినందున అన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

అక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న రియల్టర్లు, ప్రభుత్వ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలు తక్షణమే తొలగించాలన్నారు. పీలేరు తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డుల తారుమారుకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులచే సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top