అబద్ధాల్లో అపూర్వ సోదరులు

Chelluboina Venugopala Krishna Comments On Chandrababu Yanamala - Sakshi

చంద్రబాబు, యనమలపై మంత్రి చెల్లుబోయిన వేణు మండిపాటు

14 ఏళ్ల టీడీపీ పాలన కంటే 26 నెలల్లోనే బీసీలకు ఎక్కువ ప్రయోజనం

బహిరంగ చర్చకు సిద్ధమా?

సాక్షి, అమరావతి: బీసీల సంక్షేమానికి 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ వ్యయం చేసిన నిధుల కంటే 26 నెలల పాలనలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సవాల్‌ విసిరారు. అబద్ధానికి చంద్రబాబు అన్న అయితే యనమల తమ్ముడి లాంటివారన్నారు. ఈ ఇద్దరూ అపూర్వ సహోదరుల్లా తప్పుడు అంకెలు చెబుతూ అసత్యాలను వల్లిస్తున్నారని మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా పది వేల మంది బీసీల్లో ఒకరికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి బానిసల్లా చూసిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట మేరకు బీసీలకు సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. 25 సంక్షేమ పథకాల ద్వారా రూ.1,04,241 కోట్లను వివిధ వర్గాల ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేయగా బీసీలకు రూ.50,315 కోట్లను అందజేశారని వివరించారు. నగదేతర పథకాల ద్వారా వివిధ వర్గాలకు రూ.1,40,438 కోట్ల ప్రయోజనం చేకూరగా బీసీ వర్గాలకు  రూ.69,662 కోట్ల మేర మేలు జరిగిందని చెప్పారు.

ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ఒక్క బీసీ నేతనూ రాజ్యసభకు పంపలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిందని తెలిపారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు కేటాయించేలా ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇటీవల పార్లమెంటులో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టారని వివరించారు. బీసీ వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన చంద్రబాబు, యనమల ఎప్పుడైనా చేశారా? అని మంత్రి చెల్లుబోయిన ప్రశ్నించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top