ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. ఏమన్నారంటే!

Chandur Meeting: CM KCR Respond TRS MLAs Poaching Issue Counter To BJP Modi - Sakshi

సాక్షి, నల్గొండ:  మునుగోడు ఉప ఎన్నిక వేళ చండూరు సభ వేదికగా సీఎం కేసీఆర్‌ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కార్పొరేట్‌ గద్దలకు బీజేపీ  14 లక్షల కోట్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి నిధులు ఇవ్వడం చేత కాదా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే మనల్ని నూకలు తినమన్నారని,  నూకలు తినమన్న వారికి ఎన్నికల్లో తోకలు కత్తిరించాలన్నారు. బలవంతంగా రుద్దబడిన మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి చెంపపెట్టు కావాలని ఆకాంక్షించారు. 

చండూరు సభ వేదికపై సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలైన పైలట్‌ రోహిత్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని వేదికపైకి తీసుకొచ్చారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్‌ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. ఈ నలుగురు అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా తెలంగాణ, జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు.  రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. 

చదవండి: వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్‌ సూటి ప్రశ్న 

వడ్లు కొనడం చేతకాని వారు వంద కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారా అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు.  దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారని.. ఢిల్లీ బ్రోకర్లు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు.

‘నేను రాజ్యాంగబద్దమైన ముఖ్యమంత్రి పదదవిలో ఉన్నాను. కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయి. తలకుమాసినోడు ఒకడొచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. మతోన్మాద శక్తులను తరిమేస్తే తప్ప దేశం బాగుపడదు.  టీవీల్లో చూసింది చాలా చిన్నది. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top