బీజేపీ నేత సువేందు అధికారి వ‍్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దుండగుల కాల్పుల్లో ప్రాణాల కోల్పోయిన విషయం తెలిసిందే. సువేందు అధికారి తన సహాయకులను కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. 13 ఏళ్లలో సువేందు అధికారి ముగ్గురు సహాయకులను కోల్పోయారు.
ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. చంద్రనాథ్ రథ్‌ది రాజకీయ హత్య అని ఆయన అంటున్నారు. గతంలో మృతి చెందిన సువేందు అధికారి సహాయకుల వివరాలు చూద్దాం..
2013: వ్యక్తిగత సహాయకుడి మరణం
ఇలాంటి తొలి ఘటన 2013లో జరిగింది. సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ప్రదీప్ ఝా, పూర్బా మెదినిపూర్ జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే, ఆ సమయంలో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదంగా మారలేదు. దర్యాప్తు అధికారులు కూడా నేర కోణాన్ని నిర్ధారించలేదు.
2018: విగత జీవిగా భద్రతా అధికారి
సువేందుకు 2018లో వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేసిన రాష్ట్ర సాయుధ పోలీసు కానిస్టేబుల్ శుభబ్రత చక్రవర్తి.. పూర్బా మెదినిపూర్‌లోని కాంతి పోలీసు బ్యారక్‌లో విగతజీవిగా కనిపించారు. తన సర్వీస్ రివాల్వర్‌తో తానే కాల్చుకున్నారని చెబుతూ పోలీసులు మొదట దీన్ని ఆత్మహత్యగా పరిగణించారు. 2021లో చక్రవర్తి భార్య ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు కోరడంతో కేసు మరోసారి చర్చకు వచ్చింది.
ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత పశ్చిమ బెంగాల్ సీఐడీ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన స్థలాన్ని పునర్నిర్మించి, మొదటి దర్యాప్తుతో సంబంధం ఉన్న పలువురు పోలీసులను ప్రశ్నించింది. ఈ పరిణామంతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ పెరిగింది. కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి.
2021: వ్యక్తిగత సహాయకుడి మరణం
సువేందుకు మరో వ్యక్తిగత సహాయకుడైన పులక్ లాహిరి 2021లో అసాధారణ పరిస్థితుల్లో మరణించినట్టు సమాచారం. నేరపూరిత కుట్ర జరిగిందని నిర్ధారించే తుది వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.
2026: చంద్రనాథ్ రథ్ మృతి
తాజా ఘటనలో సువేందుకు సన్నిహిత సహాయకుడైన చంద్రనాథ్ రథ్‌ను కాల్చిచంపారు. రాజకీయ లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ, నిష్పక్షపాత దర్యాప్తు కోరుతున్నారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


