
సాక్షి, విజయవాడ: మహిళ దినోత్సవం ముందే మహిళలకు కూటమి సర్కార్ టోకరా వేసేసింది. ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాసన మండలి సాక్షిగా కేవలం జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడనుంచైనా ఉచిత బస్ ప్రయాణం అంటూ ప్రకటనలు హోరెత్తించారు. ప్రతి సభలో ఎక్కడ నుండి ఎక్కడవరకైనా ఉచితం అంటూ చంద్రబాబు ప్రచారం చేసింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చేసింది. దీంతో సోషల్ మీడియాలో మహిళలు తీవ్రంగా మండి పడుతున్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తన ట్రేడ్ మార్క్ మోసాన్ని ప్రదర్శించిన చంద్రబాబు తాను బురిడీ బాబునని మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు... కాదు కాదు... ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్‌లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు.. చివరికి జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెలవిచ్చారు.