మండలిలోనూ మితిమీరిన టీడీపీ | Sakshi
Sakshi News home page

మండలిలోనూ మితిమీరిన టీడీపీ

Published Fri, Sep 22 2023 4:54 AM

Chairman adjourned the meeting to Friday - Sakshi

సాక్షి, అమరావతి: శాసన మండలిలోనూ తెలుగు­దేశం పార్టీ సభ్యులు చైర్మన్‌ పోడియం పైకి ఎక్కి మితిమీరి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, టీడీపీ ఎమ్మెల్సీలు ఉద్దేశపూర్వకంగా పోడియం పైకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. గురువారం శాసన మండలిలో చంద్రబాబు అరెస్టు వ్యవహ­రంపై చర్చకు పట్టుపడుతూ టీడీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

సీపీఎస్‌పై చర్చ కోరుతూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు మరో వాయి­దా తీర్మా­నం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే ఈ రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరి­స్తున్నట్టు మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు మొదలెట్టారు. పోడియంపైకి రావడం మంచిది కాదని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొవా­లని  చైర్మన్‌ చెప్పారు. అయినా పరిస్థితి సాను­కూలంగా లేకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా..
వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవుతుండగా, చైర్మన్‌ రాకముందే టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం పైన చేరారు. చైర్మన్‌ లోపలికి వస్తూనే, పోడియంపైన టీడీపీ సభ్యులను చూసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవలే కొత్తగా ఎన్నికై తొలి­సారి సమావేశాలకు హాజరవుతున్న టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ కూడా పోడియంపైన ఉండడం చూసి.. ‘శ్రీకాంత్‌ గారూ మీరు కొత్తగా వచ్చారు. సభ మొదలు కాకమునుపే మీరు పోడియం పైకి రావ­డం సభా మర్యాద కాదు. కిందకు దిగండి’ అని సూచించారు.

అయినా టీడీపీ ఎమ్మెల్సీలు పోడి­యంౖ­పెనే ఉన్నారు. దీంతో చైర్మన్‌ తన సీటులో కూర్చోకుండా.. టీడీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి ‘సభ మొదలుకాక మునుపే పోడియంపైకి వచ్చి కూర్చుంటే ఎలా? లేకపోతే ఇక్కడ (తాను కూర్చునే సీటును చూపిస్తూ) కూర్చొండి వచ్చి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు తమకు ఉండే ప్రివిలేజీ మేరకు వారు చెప్పదలు­చుకున్నది సభలో చెప్పవచ్చు గానీ, ఇలా ప్రవర్తించడం మర్యాద అనిపించుకోదన్నారు. ఇది పెద్దల సభ అని, మర్యాద పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇలానే ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. అప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లకపోవడంతో ‘మీకు కావాల్సింది కూడా∙అదేనా..’ అని చైర్మన్‌ అన్నారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జీ స్పెషల్‌ మెన్షన్‌ వినిపించే సమయంలోనూ టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తుండడంతో మంత్రి జోగి  రమేష్‌  జోక్యం చేసుకుని చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చ­కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, టీడీపీ ఎమ్మెల్సీలే మండలి ప్రతిష్టను, చైర్మన్‌  స్థానా­న్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు.

టీడీపీ వర్సెస్‌ వైఎస్సార్‌సీపీ
చైర్మన్‌ ఎంత చెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంపైనే ఉండి నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా అధికార వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పలువురు తమ స్థానాల వద్ద నిల్చొని ‘అవినీతి పరుడు చంద్ర­బాబు డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు రెండోసారి సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. నాలుగో విడత సభ ప్రారంభమయ్యాక కూడ టీడీపీ ఎమ్మెల్సీల తీరులో మార్పు లేకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు మండలి చైర్మన్‌ ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement