
పెద్ద వీరుడొచ్చాడు.. అలాంటివాడితో పిల్లాడి బొడ్డు కోయిస్తే పెద్దయ్యాక వీడు కూడా వీరుడవుతాడని భావించిన తల్లిదండ్రులు వేలాదిమంది సమక్షంలో బిడ్డకు బొడ్డుకోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట. ఆ మహావీరుడు జనాన్ని చూసి కత్తిని రకరకాలుగా తిప్పి.. విన్యాసాలు చేసి ఇదిగో చూడండి బొడ్డు కోస్తున్నాను అని చెప్పి ఇంకేదో కోసేశాడట.. దీంతో తల్లిదండ్రులు అయ్యో దేవుడా ఇదేందీ ఇలా జరిగిందని లోలోన కుమిలిపోతున్నారట.
వాస్తవానికి వైఎస్ జగన్ పర్యటనలను ఆపడానికి.. జనం నుంచి ఆయన్ను దూరం చేయడానికి కూటమి నాయకులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఆయన పర్యటనలను నిర్వీర్యం చేయడం.. ప్రజల్లో జగనుకు ఆదరణ తగ్గిందని చెప్పడం కోసం ఎన్నో పథకాలు వేస్తున్నారు. అయినా సరే మొన్నటి గుంటూరు పర్యటన.. అంతకుముందు కడప ఇలా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వేలాదిగా తరలివెళ్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ జగన్ మీద ప్రభుత్వం బోలెడు ఆంక్షలు విధించింది.
కేవలం 500 మందికి మించకుండా కార్యకర్తలు ఆయన వెంట ఉండాలని రూల్ తెచ్చింది. అంతేకాకుండా ఆ పర్యటనకు రకరకాలుగా కండీషన్లు పెట్టారు.. కండీషన్లు పెడితే జనానికి ఎక్కడో కాలుతుంది.. సరిగ్గా జగన్ పర్యటన విషయంలో కూడా అదే జరిగింది. బంగారుపాళ్యం పర్యటనను భగ్నం చేసేందుకు మూడు నాలుగు జిల్లాల ఎస్పీలు.. 9 మంది అదనపు ఎస్పీలు అంతకు డబుల్ డీఎస్పీలు.. వందలాదిమంది ఎస్సైలు కానిస్టేబుళ్లు కలిసి మొత్తం ఓ రెండు వేల మంది పోలీసులను జగన్ పర్యటనకు మోహరించారు.
అదేంది 500 మందికి మించకుండా జనాన్ని రమ్మన్నారు కదా మరి మీరేందుకు రెండు వేల మంది వచ్చారు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కరువైంది. ఇక పోలీసుల నిర్బంధం పెరిగిన కొద్దీ ప్రజల్లో కసి పెరిగింది. ఎవరో ఎస్సై వచ్చి మమ్మల్ని నియంత్రించడం ఏందీ.. మేము సినిమాకు వెళ్లాలా.. జాతరకు వెళ్లాలా.. జగన్ పర్యటనకు వెళ్లాలా అనేది మా ఇష్టం. మధ్యలో వీళ్ళ జోకుడు ఏమిటన్న ఫీల్ జనంలో మొదలైంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన ఈ ఆత్మాభిమానం ఉప్పెనలా మారింది. గ్రామాలు దండుకట్టాయి.. పల్లెలు పరవశించాయి.. ఇంకేముంది మళ్ళీ వింటేజ్ జగన్ ఆవిష్కృతమయ్యారు.
ఎక్కడికక్కడ వందలు వేలల్లో ప్రజలు చెట్టూ పుట్టా వాగు వంక దాటుకుని జగన్ వెంట నడిచారు.. మొత్తానికి నిర్బంధం ఎంత ఎక్కువైతే ప్రతిఘటన అంతకు వందింతలు ఉంటుందని ప్రజలు నిరూపించారు. పల్లెల్లో పోలీసుల రుబాబు పెరిగేసరికి అదే మొత్తంలో జగన్ పట్ల అభిమానం ఆదరణ రెట్టింపు అయ్యింది. దీంతో అయ్యవారి బొమ్మ గీయబోతే కోతి బొమ్మ వచ్చిందన్నట్లుగా జగన్ ప్రోగ్రాములు భగ్నం చేయబోగా అది కాస్తా ఎదురుతన్నింది. అన్నిటికి మించి జనాన్ని జగన్ నుంచి విడదీయడం అంత వీజీ కాదని పోలీసులకు ప్రభుత్వానికి అర్థమైంది. మొత్తానికి పోలీసులతోనే జగన్ పర్యటనలు సక్సెస్ అవుతున్నాయి అని ప్రజలు అర్థం చేసుకున్నారు .
-సిమ్మాదిరప్పన్న