అప్పులు, ప్రగతిపై అడ్డగోలుగా అబద్ధాలు

Buggana Rajendranath Fires On TDP Yanamala Ramakrishnudu - Sakshi

యనమలపై ఆర్థిక మంత్రి బుగ్గన మండిపాటు

ఖజానా ఖాళీ చేసి భారీ అప్పులు, బకాయిలతో దిగిపోయిన టీడీపీ

విద్యపై రూ.53 వేల కోట్లు వ్యయం చేశాం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పారిశ్రామిక ప్రగతితో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేయడమే కాకుండా భారీ అప్పులతో ఏకంగా రూ.40 వేల కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయిన యనమల రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతూ బుకాయించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బుధవారం సచివాలయంలో బుగ్గన మాట్లాడారు.

► నీతి ఆయోగ్‌ 10 అంశాలతో నివేదిక ఇస్తే తనకు అనుకూలమైన ఒక అంశానికి చెందిన అంకెలను తీసుకుని యనమల తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. సున్నా వడ్డీని రైతులకు చెల్లించకుండా టీడీపీ సర్కారు రూ.784.71 కోట్ల బకాయిలు పెడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తాన్ని 39.06 లక్షల మంది రైతులకు చెల్లించింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఇప్పటికే రూ.1795.45 కోట్లు చెల్లించాం. 8.76 లక్షల మంది కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రూ.5,915 కోట్ల పంట రుణాలు ఇప్పించాం.

► విద్య, వైద్య రంగాల్లో నాడు – నేడు కింద చేపట్టిన పనులను యనమల తుని నియోజకవర్గానికి వెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. నాడు–నేడుతోపాటు అమ్మఒడి, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక,  సంపూర్ణ పోషణ తదితరాలకు మూడేళ్లలో రూ.53,337 కోట్లు వ్యయం చేశాం. జాతీయ ఆరోగ్య సూచికలో 2017–18లో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా ఇవాళ 10వ స్థానంలో ఉందని యనమల పచ్చి అబద్ధాలాడుతున్నారు. 2019–20లో ఏపీ 4వ స్థానంలో ఉంది. వైద్య రంగంలో 2017–18లో 65.13 స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉంటే 2019–20లో 69.95 స్కోర్‌తో మార్కులు పెరిగాయి. మా ప్రభుత్వం 104, 108 వాహనాలు 1,108 కొనుగోలు చేసింది. 

► సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018–19లో 68 మార్కులుంటే  2020–21లో 77 మార్కులకు పెరిగాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో యనమల తనకు అనుకూలమైన లెక్కలు తీసుకుని వక్రీకరిస్తున్నారు. 2018–19లో తొలి అడ్వాన్స్‌ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,80,332 కోట్లుగా అంచనా వేయగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల శాఖ ప్రకటించిన మూడో రివైజ్ట్‌ అంచనాల మేరకు రూ.6,26,614 కోట్లకు తగ్గింది. అంటే 11 శాతం నుంచి వృద్ధి 5.66 శాతానికి తగ్గింది. మరి ఇది ఎవరి నిర్వాకం? ఎవరిని తప్పుబట్టాలి?

► టీడీపీ హయాంలో అప్పులు భారీగా పెరిగాయి. టీడీపీ పాలనలోవార్షిక సగటు అప్పుల వృద్ధి 19.44 శాతం కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 15.46 శాతం మాత్రమే. కోవిడ్‌ వల్ల రెండేళ్ల పాటు ఇబ్బందులు ఎదురైనా ఆర్థికంగా మెరుగ్గానే ఉన్నాం. 

► నీటిపారుదల, వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. టీడీపీ హయాంలో పది లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చినట్లు అవాస్తవాలు చెబుతున్నారు. పోలవరాన్ని పక్కనపెట్టి కమీషన్ల కోసం పట్టిసీమ చేపట్టారు. పోలవరం జాప్యానికి టీటీపీ సర్కారు నిర్వాకమే కారణం. టీడీపీ హయాంలో రహదారుల నిర్మాణానికి ఏడాదికి రూ.2,110 కోట్లు వ్యయం చేస్తే ఇప్పుడు రూ.2,800 కోట్లు వెచ్చిస్తున్నాం.

► టీడీపీ హయాంలో సగటున ఏడాదికి రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే ఇప్పుడు రూ.13,201 కోట్లు వస్తున్నాయి. పెద్ద, మెగా పరిశ్రమలు 107 రాగా ఎంఎస్‌ఎంఈలు 1,06,249 యూనిట్లు వచ్చాయి. వాటి పెట్టుబడి రూ.14,656 కోట్లు. మరో 57 ప్రాజెక్టులు రూ.91,243 కోట్ల పెట్టుబడితో పురోగతిలో ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1,06,800 కోట్లతో నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 63,509 ప్రాజెక్టుల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top