Sakshi News home page

జమిలి అయినా ఓకే!

Published Tue, Sep 5 2023 1:04 AM

BRS Party Ready For Jamili elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచార సన్నద్ధతను ప్రారంభించిన భారత్‌ రాష్ట్ర సమితి, తాజాగా జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ పేరిట జమిలి ఎన్నికల అంశం తెరమీదకు వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తే అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టతతో ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలతోనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. అయితే గతంలో జమిలి ఎన్నికలకు సానుకూలంగా స్పందించిన బీఆర్‌ఎస్‌ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ అంశంపై అప్పుడే ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా, సరైన సమయంలో స్పందించాలని నిర్ణయించినట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ కోసం ఏర్పాటైన కమిటీలో దక్షిణాది నుంచి ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడాన్ని పార్టీ తప్పు పడుతోంది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదని భావిస్తున్న బీఆర్‌ఎస్‌.. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలు జరిగినా డిసెంబర్‌లోపే పోలింగ్‌ ఉంటుందని అంచనా వేస్తోంది. 

విపక్షాలను గందరగోళంలోకి నెట్టేందుకేనా! 
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో విపక్షాలను గందరగోళంలోకి నెట్టడంతో పాటు తన ఎత్తుగడలతో ఆ పార్టీలను కకావికలం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ జమిలి ఎన్నికలను శరవేగంగా తెరమీదకు తెచ్చినా సంసిద్ధంగా ఉండేలా బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేంద్రం లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించినా, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందని కేసీఆర్‌ లెక్కలు వేస్తున్నారు.

అయితే లోక్‌సభకు ముందుగా ఎన్నికలు జరిగితే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు ఉంటాయని సమాచారం. తెలంగాణతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రను కూడా కలుపుకొని 65 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్, లోక్‌సభ ఎన్నికల్లో పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు అవసరమైన వ్యూహం, కార్యాచరణపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.  

నియోజకవర్గాల్లో పరిస్థితిపై దృష్టి 
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించి పక్షం రోజులు కావస్తుండగా, సుమారు 40కి పైగా నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు కొలిక్కి రావడం లేదని కేసీఆర్‌ అంచనాకు వచ్చారు. వివిధ సర్వే సంస్థలు, నిఘా వర్గాల నుంచి అందిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని మదింపు చేస్తున్నారు.

మూడోవంతు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అధినేత.. ఈ నెల రెండో వారం నుంచి బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై వరుస సమీక్షలకు సిద్ధమవుతున్నారు. తాను పోటీ చేయాలని భావిస్తున్న కామారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలు, కేడర్‌తో ఈ నెల 7న భేటీ కానున్నారు.   

Advertisement
Advertisement