చర్చ పెట్టు..సమాధానమిస్తాం | Sakshi
Sakshi News home page

చర్చ పెట్టు..సమాధానమిస్తాం

Published Mon, Feb 5 2024 1:23 AM

BRS MLA Harish Rao Accepts CM Revanth Reddy Challenge - Sakshi

వనస్థలిపురం (హైదరాబాద్‌), సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదు గనకనే ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిసవాల్‌ చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చపెట్టాలని.. దిమ్మతిరిగే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. గతంలో తాము అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపేర్‌ కాలేదంటూ కాంగ్రెస్‌ తప్పించుకుందని.. ఇప్పుడు తాము అలా చేయకుండా ధైర్యంగా చర్చకు వస్తామని చెప్పారు.

గత పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తాము రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌కు ఆలోచన లేక, అర్ధంకాక ఆగమాగమై మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి నీటి సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. 

విభజన బిల్లులో పెట్టిందెవరు?
‘‘రాష్ట్ర విభజన సమయంలో.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్‌ చేసింది కాంగ్రెస్‌ కాదా? ఆ బిల్లును తయారుచేసింది మీ జైపాల్‌రెడ్డి, జైరాం రమేశ్‌ కాదా? అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశాం. నాడు టీడీపీలో ఉన్న రేవంత్‌ పోతిరెడ్డిపాడుపై ఏమాత్రం స్పందించలేదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్యనాయుడు ఉదయమే రేవంత్‌కు చెప్పారు.

కానీ మధ్యాహ్నమే రేవంత్‌ చిల్లర మాటలు మాట్లాడారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. తాము మేం కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్‌ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే హైదరాబాద్‌కు మంచినీటి సమస్య వస్తుందని.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు సాగునీరు, తాగునీటి సమస్య నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

హామీల అమలుపై ప్రశ్నిస్తే ఆరోపణలా? 
కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని.. హామీలపై ప్రశ్నిస్తే పసలేని అంశాలతో ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. డిసెంబర్‌లోనే రూ.4వేలు పింఛన్‌ ఇస్తామని, ఫిబ్రవరి 1న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇస్తామని, డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని డేట్లు పెట్టి.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి ముక్కలవుతోందని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని హరీశ్‌రావు చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ గెలవనందున రాష్ట్రంలో హామీలను అమలు చేయడం కుదరడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి సాకు చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరగబోతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement