హైదరాబాద్‌ ఫలితాలతో నూతనోత్తేజం! | BJP Victory In Hyderabad Given New Impetus Maharashtra BJP As well | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఫలితాలతో నూతనోత్తేజం!

Dec 7 2020 7:56 AM | Updated on Dec 7 2020 8:37 AM

BJP Victory In Hyderabad Given New Impetus Maharashtra BJP As well - Sakshi

సాక్షి ముంబై: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లభించిన మంచి ఫలితాలతో ఒక్కసారిగా మహారాష్ట్ర బీజేపీలో కూడా నూతన ఉత్తేజం నిండింది. దీంతో రాబోయే బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఎన్నికల్లో కూడా బీజేపీదే పైచేయి అవుతుందన్న ధీమాను ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్‌ కదం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బిహార్‌లో బీజేపీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 4 సీట్లు ఉన్న బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని హైదరాబాద్‌లో పాగా వేసింది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్‌ఎస్‌తోపాటు ఎంఐఎంకు గట్టి పోటీ నిచ్చి బీజేపీ తన సత్తాను చాటుకుంది.

దీంతో ముంబైతోపాటు మహారాష్ట్ర బీజేపీలో నూతన ఉత్తేజం నిండింది. ఇదే ఉత్తేజాన్ని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వరకు కొనసాగుతుందని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)లో బీజేపీ తన జెండా ఎగురవేస్తుంది’’ అని రామ్‌ కదం పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎంసీలో బీజేపీదే అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు బీఎంసీని కైవసం చేసుకునేందుకు ‘మిషన్‌ ముంబై’ ప్రారంభించినట్లు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుంచే బీఎంసీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నట్టు తెలిసింది.  చదవండి: (రజనీ వెనుక కాషాయం!) 

అధినాయకత్వమే దిగినవేళ.. 
హైదరాబాద్‌ ఎన్నికల్లో హిందు–ముస్లిం అంశం ప్రధానంగా ఉండేలా బీజేపీ ప్రయత్నించినట్లు కన్పించింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇవ్వడం, ఎంఐఎం స్పందించడం తదితరాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చల్లో కెక్కాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా ఎన్నికల్లో ప్రచారం చేసి తన ముద్రను వేసుకున్నారు.

ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా బీజేపీ తన పూర్తి బలాన్ని వినియోగించింది. దీంతో హైదరాబాద్‌లో అధికార పార్టీ తెరాసకు తీవ్ర నష్టం వాటిల్లింది. 48 స్థానాలు దక్కించుకుని హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇదే మాదిరిగా రాబోయే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసి మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు సమాచారం.  చదవండి:  (హైదరాబాద్‌ ఫలితాలతో నూతనోత్తేజం!)

హిందుత్వ కార్డు పనిచేస్తుందా? 
హైదరాబాద్‌లో నడిచిన హిందుత్వం కార్డు ముంబైలో ఎంత వరకు ప్రభావం చూపనుందనేది ప్రశ్నార్థకమే. హిందుత్వం అంశంపై శివసేనపై బీజేపీ విమర్శలు గుప్పించవచ్చు కానీ, మిగతా అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరింత పక్కా ప్రణాళికను రూపొం దించాలని కమలం పార్టీ భావిస్తోంది. అదేవిధంగా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు అన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకుంటోంది. రాష్ట్రంలో జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీకి షాక్‌ నిస్తూ నాగ్‌పూర్, పుణే, ఔరంగాబాద్‌ మొదలగు పెట్టనికోటగా ఉన్న స్థానాలను బీజేపీ కోల్పోయింది.

మహావికాస్‌ ఆఘాడీ ఐక్యతతో పోరాడటంతో బీజేపీపై విజయం సాధించగలిగారు. ఇలాటి నేపథ్యంలో బీఎంసీలో కూడా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటిగా మహావికాస్‌ ఆఘాడిగానే పోటీ చేయాలని భావిస్తున్నాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే రెట్టింపు బలంతో బీజేపీకి ఎన్నికల బరిలోకి దిగాల్సి రానుంది. బీఎంసీ ఎన్నికల్లో మహావికాస్‌ ఆఘాడీని అడ్డుకోవడంలో బీజేపీ ఎంత వరకు సఫలీకృతం కానుందని రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement