TS: బీజేపీకి ఊహించని షాక్‌.. జేపీ నడ్డా పర్యటన వేళ ట్విస్ట్‌?

BJP Public Meeting Canceled At Warangal Arts College - Sakshi

సాక్షి, హనుమకొండ: తెలంగాణలో బీజేపీకి మరో షాక్‌ తగిలింది. ఈ నెల 27న హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బన్న అయిలయ్య తెలిపారు. సభకు అనుమతి లేదని గురువారం రాత్రి పోలీసులు చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు వాట్సాప్‌లో లేఖ పంపారు. అలాగే, గ్రౌండ్‌ కోసం ఇచ్చిన రూ.5 లక్షలు తిరిగి ఇస్తామని తెలిపారు. 

దీంతో రావు పద్మతో పాటు బీజేపీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు హనుమకొండ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నా పర్మిషన్‌ తెచ్చుకున్నామని, ఇప్పుడు సభకు కూడా కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగానే శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేయనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. కాగా, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

మరోవైపు.. బండి సంజయ్‌ పాదయాత్ర నేడు పున:ప్రారంభం కానుంది. హైకోర్టు అనుమతులతో పాంనూర్‌ నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం అవనుంది. ఉప్పుగల్‌, కోనూర్‌, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడతలో పాదయాత్ర ముగియనుంది. కాగా, పాదయాత్ర నేపథ్యంలో బండి సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హెచ్చరించింది. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది. ఇక, పాదయాత్ర రూట్‌లో పోలీసులు భారీగా మోహరించారు. 

ఇది కూడా చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్‌ రెడ్డికా.. బీసీకా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top