‘ఒకట్రెండు ఎన్నికల్లో గెలిస్తే విర్రవీగడం పనికిరాదు’

BJP Is Provoking Telangana People Says Etela Rajender - Sakshi

బీజేపీ విషం చిమ్ముతోంది..

కలిసి ఉన్న ప్రజలను రెచ్చగొడుతోంది

వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్‌ సంస్థలకే మేలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ 

సాక్షి, హుజూరాబాద్‌: కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండే తెలంగాణ ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందని, తెలంగాణ ప్రభుత్వ పాలనపై విషం చిమ్ముతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు ప్రజల మధ్య చిచ్చుపెట్టే పనులు మానుకోవాలన్నారు. స్థాయిని మించి విమర్శలు చేయొద్దని హితవు పలికారు. ఒకటి, రెండు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన విర్రవీగడం పనికిరాదన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందన్నారు. పరిశ్రమల రాక తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ సంస్థలను ప్రైవేటీకరణ చేసిందన్నారు.

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేలా ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్ప, అదనంగా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, వీణవంక ఎంపీపీ మునిపట్ల రేణుక, జమ్మికుంట జెడ్పీటీసీ డాక్టర్‌ శ్రీరామ్‌శ్యాం, నాయకులు కుమార్‌యాదవ్, సందమల్ల బాబు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top