బీజేపీ దూకుడు.. తెలంగాణలో వెస్ట్‌ బెంగాల్‌ వ్యూహం!

BJP Plans West Bengals strategy in Telangana - Sakshi

అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. ఓ వైపు క్షేత్ర స్థాయిలో బలపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సీనియర్లను రంగంలోకి దింపుతోంది. వచ్చే ఎన్నికల్లో వారిని పోటీకి నిలపడం ద్వారా అధికార పార్టీకి చెక్‌ పెట్టాలని భావిస్తోదంట. 

2023 ఎన్నికలు టార్గెట్‌గా పావులు కదుపుతున్న బీజేపీ ప్రతి అంశాన్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్‌ కావడంతో.. నియోజకవర్గాల్లో పట్టు కోసం ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణ ఎన్నికలు జరగనుండడంతో.. సీనియర్‌ నేతలు, సిట్టింగ్‌ ఎంపీలు, మాజీలను అసెంబ్లీకి పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చిందట. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేసిందట. సీనియర్లు పోటీ చేయడం వల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముంటుందని, పార్టీకి అది కలిసి వస్తుందని అగ్రనేతలు భావిస్తున్నారట. 

గత ఏడాది జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో బీజేపీ హోరాహోరీగా తలపడింది. చాలా చోట్ల సీనియర్లు, ఎంపీలను బరిలోకి దించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే తరహా వ్యూహాన్ని అవలంభించాలని డిసైడైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డితో పాటు సిట్టింగ్‌ ఎంపీలు, మాజీలు కూడా అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడం సమీకరణాలు మార్చివేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో అంబర్‌ పేట నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

వేములవాడ నుంచి బండి సంజయ్ ?
అలాగే సిట్టింగ్‌ ఎంపీ, బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ నుంచి.. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్‌ నుంచి. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు బోథ్‌ నుంచి.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన సొంత నియోజకవర్గం గద్వాల నుంచి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి ?
సీనియర్‌ నేతలు, ఎంపీలకు తోడు మాజీలు కూడా అసెంబ్లీకి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుండడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుంటే.. విజయశాంతి మెదక్ లేదా హైదరాబాద్‌ సిటీలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాండూరు లేదా మహేశ్వరం నుంచి పోటీచేసే అవకాశముందని అంటున్నారు. మాజీ ఎంపీ వివేక్‌ చెన్నూరు నుంచి పోటీకి ఆసక్తి చూపుతన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధర్ రావు లాంటి నేతలు  నియోజకవర్గాల అన్వేషణలో పడడం  కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. ప్రస్తుతం హుజూరాబాద్‌ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతుండడం అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తోంది. 

ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ ఆ తర్వాత కొంత పట్టు కోల్పోయింది. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలవడం ద్వారా మరోసారి రేసులోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరింది. ఆ వెంటనే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. గత ఏడాది హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో సంచలన విజయం సాధించి తెలంగాణలో బలమైన శక్తిగా ఆవిర్భవించింది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఏర్పడడంతో.. దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకోసం అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. సీనియర్లు, మాజీలు, సిట్టింగ్‌ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించడం కూడా అందులో భాగమేననే టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని కమలనాథులు సిద్ధమవుతుండడం తెలంగాణ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top