UP Assembly Elections 2022: అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ ఆయనే..

BJP Named 91 More Candidates For Uttar Pradesh Assembly Elections - Sakshi

91 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల

సీఎం యోగి మీడియా సలహాదారుడికి టిక్కెట్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు 91 మందితో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో 13 మంది మంత్రులకు చోటు దక్కింది. అయితే సహాకార శాఖ మంత్రి ముకుత్‌ బిహారీ వర్మను తప్పించి... కైసర్‌గంజ్‌ నియోజకవర్గంలో ఆయన కుమారుడు గౌరవ్‌కు టిక్కెట్‌ ఇచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్‌ మీడియా సలహాదారు శలభ్‌ మణి త్రిపాఠిని డియోరియా నుంచి అసెంబ్లీ బరిలోకి దింపింది కాషాయదళం. ప్రతిష్టాత్మక అయోధ్య స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్‌ గుప్తాకు తిరిగి అవకాశమిచ్చింది.  అయోధ్య జిల్లాలోని మరో నాలుగు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై బీజేపీ విశ్వాసం ఉంచింది.

అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్ (రిజర్వుడు నియోజకవర్గం) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబా గోరఖ్‌నాథ్, రుదౌలీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్‌ పేర్లు ఖరారు చేసింది. బికాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ అమిత్ సింగ్ చౌహాన్ బరిలోకి దిగనున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా సింగ్ చౌహాన్ కుమారుడు. గోసైయ్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీ అలియాస్‌ ఖబ్బు తివారీ భార్య ఆర్తీ తివారీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. (చదవండి:  యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్‌ సంఘ్‌ కార్యకర్తలు)

బీజేపీ తాజా జాబితాలో 25 మంది ఓబీసీలు, 21 మంది దళితులు, 20 మంది బ్రాహ్మణులు, 18 మంది ఠాకూర్లు, నలుగురు భూమిహార్లు, ఇద్దరు బనియాలు, కాయస్థ కమ్యూనిటీ నుండి ఒక అభ్యర్థి ఉన్నారు. చాలా డిమాండ్ ఉన్న లక్నో అసెంబ్లీ స్థానాలపై బీజేపీ సస్పెన్స్‌ను కొనసాగించింది. ఈ స్థానాల  కోసం అనేక బీజేపీ నాయకులు భారీగా పైరవీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 37 మంది మహిళలు సహా 295 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) కూడా ఇప్పటివరకు నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. (చదవండి: కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top