మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం  | BJP Leader JP Nadda Comments On CM KCR And BRS Party In Telangana Assembly Elections Campaign - Sakshi
Sakshi News home page

మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం 

Nov 24 2023 4:22 AM | Updated on Nov 24 2023 12:47 PM

BJP Leader JP Nadda Comments In Telangana Election campaign - Sakshi

నిజామాబాద్‌లో జరిగిన సకల జనుల విజయ సంకల్పసభలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వందలాది మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ.. కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. దేశంలో పలు రాష్ట్రాలకు కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించామని, తెలంగాణలోనూ కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ రిజర్వేషన్లను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సంగారెడ్డి, నిజామాబాద్‌లలో జరిగిన బహిరంగ సభల్లో నడ్డా ప్రసంగిస్తూ.. బీఆర్‌ఎస్‌ను భ్రష్టాచార్‌ రాక్షస సమితిగా అభివర్ణించారు.

ధరణి పోర్టల్‌ ఏర్పాటు చేసి సర్కారు భూములను చెరబట్టారని, హైదరాబాద్‌ మియాపూర్‌లో 692 ఎకరాల భూకుంభకోణం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని, రూ.38 వేల కోట్ల ఈ ప్రాజెక్టును రూ.1.20 లక్షల కోట్లకు పెంచి అందిన కాడికి దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు టెండర్లలోనూ రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయని, దళితబంధు పథకంలో బీఆర్‌ఎస్‌ నాయకులు 30 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను జైలుకు పంపాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 

రామగుండం కర్మాగారాన్ని పునఃప్రారంభించాం: కర్ణాటకలో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నడ్డా విమర్శించారు. కర్ణాటకలో నాలుగు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదన్నారు. కాంగ్రెస్‌ మాదిరిగానే కేసీఆర్‌ కూడా హామీల పేరుతో ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ధరణి పోర్టల్‌ కాదు.. అది కేసీఆర్‌ భూములు హరించే పోర్టల్‌ అని చెప్పారు.

మోదీ ప్రభుత్వం తెలంగాణలో ప్రత్యేకంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించిందని, వందేభారత్‌ రైళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నిరుపేదలకు ఏటా నాలుగు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆడపిల్ల పుడితే పెళ్లి వయస్సు వచ్చే సరికి రూ.రెండు లక్షలు వచ్చేలా బాండ్లు ఇస్తామని, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు.  
 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి భారత్‌ 
తెలంగాణ కోసం బలిదానాలు చేసిన, ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులను సైతం కేసీఆర్‌ ప్రభుత్వం వంచించిందని నడ్డా వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌ అవినీతితో తన కుటుంబ సభ్యులను బాగుచేసుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, కవిత పాలన నడుస్తోందన్నారు.  విభజన సమయంలో ధనికంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. కేంద్ర నిధులతో పథకాలు అమలు చేయకుండా కేసీఆర్‌ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీతోపాటు అనేక హమీలను కేసీఆర్‌ తుంగలో తొక్కారన్నారు.

మోదీ ప్రభుత్వం దేశంలో 5జీ నెట్‌వర్క్‌ తెస్తే రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం గప్‌లా (అక్రమాలు), గోటాలా (కుంభకోణాలు), గూస్‌కోరీ (అవినీతి), గరీబీ, గూండారాజ్‌ తెచ్చిందన్నారు. తెలంగాణలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలను మారుస్తామని, అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరిందన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, పసుపు శుద్ధి యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పసుపునకు మద్దతు ధర లభిస్తుందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement