మల్కాజిగిరి ఎంపీ అవకాశం నాకివ్వండి: ఈటల రాజేందర్‌

BJP Etela Rajender Comments On Malkajgiri MP contesting - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా:  తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తమ సొంత కాళ్లపై నిలబడి పోటీ చేసి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీచేస్తానని మరోసారి ఈటల పేర్కొన్నారు.

యాదగిరిగుట్టలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడిగడ్డపై సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. అధికారం వచ్చాక మాట మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి, తప్పుదోవ పట్టించి హామీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తోందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హామీలపై ప్రజల భ్రమలు తొలగుతున్నాయని అన్నారు ఈటల. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య, అక్యూపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ హామీలపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.  సీఎం రేవంత్  అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
చదవండి: TS: ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని.. రూ. 6300కోట్ల రూపాయాలతో మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. నిజమాబాద్‌లో పసుపు బోర్డు పెట్టి నేనున్నానని భరోసా ఇచ్చారని ప్రస్తావించారు. దక్షిణాన రూ. 26వేల కోట్లతో‌ రిజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. 

‘ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కేసీఆర్ సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశారు. కేసీఆర్ లక్ష రూపాయాల రుణమాఫీ ఐదేళ్ళ కాలంలో పూర్తి స్థాయిలో జరగలేదు. రెండు లక్షల రుణ మాఫీ ఒకటే దఫా చేయాలంటే సాధ్యం కానీ పరిస్థితి. గతంలో కేసీఆర్ జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన హామీలను అరచేతిలో వైకుంఠం చూపెడతున్నారు. 400లకు పైగా ఉన్న హామీలను మరోసారి కాంగ్రెస్ చదువుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఇండియా కూటమి అతుకుల బొంతగా మారింది. దేశం ఒక్కప్పుడు బాంబుల మోతలు, మత కలహాలు  ఉండేది.‌ బీజేపీ పాలనలో దేశమంతా ప్రశాంతంగా ఉంది’ అని పేర్కొన్నారు. 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top