Munugode By-Election 2022: Bandi Sanjay Challenge To CM KCR At Munugode Public Meeting - Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌.. నీకు సిగ్గు, శరం ఉంటే కుంటుంబంతో శివాలయానికి రా.. నేను నా కుంటుంబంతో వస్తా’

Published Sat, Oct 22 2022 1:50 AM

Bandi Sanjay Challenge To CM KCR At Munugode Public Meeting - Sakshi

సాక్షి, సంస్థాన్‌ నారాయణపురం: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ మునుగోడు ఉప ఎన్నిక మీదే ఆధారపడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ బండి సంజయ్‌ సంస్థాన్‌ నారాయణపురంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రాచీన శివాలయం నుంచి చౌరస్తా వరకు సాగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. గొర్రెల యూనిట్లకు డబ్బులు రావొద్దని ఈసీకి ఫిర్యాదు చేయలేదన్నారు.

‘కేసీఆర్‌.. నీకు సిగ్గు, శరం ఉంటే కుంటుంబంతో ఇక్కడే శివాలయానికి రా. నేను నా కుంటుంబంతో వస్తా’అని సవాల్‌ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కలిసి గుంటనక్కలు గుంపులుగా వచ్చినా రాజగోపాల్‌రెడ్డి లాంటి సింహం ఒంటరిగానే వస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతోనే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మనిషికి రూ.40వేలు ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం అమ్ముకోవద్దని ప్రజలను కోరారు.

పోడు భూముల సమస్యలు పరిష్కరించకుండా, రిజర్వేషన్‌ ఇవ్వకుండా సీఎం గిరిజనులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌ గడీలు బద్దలుకొట్టాలంటే బీజేపీ అభ్యర్థినే గెలి పించాలని కోరారు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పిట్టల దొరల స్టోరీలు ప్రజలు ఎక్కువ రోజులు నమ్మలేరని, కేసీఆర్‌ సినిమా క్లైమాక్స్‌కి వచ్చిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు వివేక్, బూర నర్సయ్యగౌడ్, జితేందర్‌రెడ్డి, నేతలు విఠల్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement