31 నుంచి అసెంబ్లీ పెట్టండి

Ashok Gehlot proposal on assembly session to Rajastan governor - Sakshi

గవర్నర్‌కు రాజస్తాన్‌ కేబినెట్‌ తాజా ప్రతిపాదన

కరోనాపై, రాష్ట ఆర్థిక స్థితిపై, పలు బిల్లులపై చర్చించాల్సి ఉందని వివరణ

నేడు దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌ల ఎదుట కాంగ్రెస్‌ నిరసన

జైపూర్‌/న్యూఢిల్లీ: రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కేబినెట్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు తాజా ప్రతిపాదనను పంపించారు. ఆ లేఖ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు శనివారం రాత్రే చేరిందని రాజ్‌ భవన్‌ వర్గాలు ఆదివారం తెలిపాయి. కరోనా వ్యాప్తిపై చర్చ, రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ, అత్యవసరంగా చేపట్టాల్సిన బిల్లులు.. మొదలైన అంశాలను తాజా ప్రతిపాదనలో చేర్చారు.

అయితే, గహ్లోత్‌ ప్రభుత్వ విశ్వాస పరీక్ష ఆ ప్రతిపాదిత ఎజెండాలో ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు. అసెంబ్లీ భేటీ కోరుతూ శుక్రవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన ధర్నా అనంతరం, ఆరు అంశాల్లో ప్రభుత్వం నుంచి గవర్నర్‌ వివరణ కోరారు. పూర్తి వివరాలతో మళ్లీ ప్రతిపాదన పంపాలని కోరారు. మెజారిటీ ఉన్నప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. దాంతో శనివారం మళ్లీ సమావేశమైన కేబినెట్‌ తాజా ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది.  

గవర్నర్‌పై కేంద్రం ఒత్తిడి
కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్‌ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్‌ సింఘ్వీ విమర్శించారు.  అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో కేబినెట్‌ సిఫారసుల ప్రకారం గవర్నర్‌ నడుచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌లో విలీనమైన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్‌ సీపీ జోషి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ విమర్శించారు.  

కరోనా వ్యాప్తిపై గవర్నర్‌ ఆందోళన
రాజస్తాన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతమవుతోందని కల్‌రాజ్‌ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి యాక్టివ్‌ కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగిందన్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో గవర్నర్‌ కరోనాపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు, చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ స్వరూప్, డీజీపీ భూపేంద్ర యాదవ్‌ ఆదివారం గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసి రాజ్‌భవన్‌ భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించారు.

రాజ్‌భవన్‌ల ముందు కాంగ్రెస్‌ నిరసనలు
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు గవర్నర్లు అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దేశంలోని అన్ని రాజ్‌ భవన్‌ల ఎదుట సోమవారం ఉదయం నిరసన తెలపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌ల ముందు ‘సేవ్‌ డెమొక్రసీ – సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జెవాలా తెలిపారు. అయితే, ఆ కార్యక్రమాన్ని రాజస్తాన్‌లో మాత్రం నిర్వహించబోవడం లేదని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ తెలిపారు.

గతంలో మధ్యప్రదేశ్‌లో, ఇప్పుడు రాజస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు బీజేపీ ఖూనీ చేసిందని సూర్జెవాలా విమర్శించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను బీజేపీ కాలరాస్తోందని ఆరోపిస్తూ ‘స్పీక్‌ అప్‌ ఫర్‌ డెమొక్రసీ’ పేరుతో దేశవ్యాప్తంగా డిజిటల్‌ ప్రచారాన్ని కాంగ్రెస్‌ ఆదివారం ప్రారంభించింది. కాంగ్రెస్‌ విమర్శలపై.. ‘900 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట’ అంటూ బీజేపీ రాజస్తాన్‌ శాఖ అధ్యక్షుడు సతిష్‌ పూనియా స్పందించారు. మరోవైపు, సచిన్‌ పైలట్‌ సహా 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top