మజ్లిస్‌ విస్తరణ వ్యూహం

Asaduddin Owaisi Plan To Expansion Of AIMIM - Sakshi

మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాగా

ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోటీకి సన్నద్ధం

ఉత్తరప్రదేశ్‌లోనూ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రాబల్యాన్ని మరింత పెంచుకొనే దిశగా ఆలిండియా మజ్లిస్‌ ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పావులు కదుపుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీకే పరిమితం అనుకున్న ఆ పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతున్నారు. 

తమిళనాడులో కమల్‌ పార్టీతో పొత్తు!   
పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనాభాలో 30 శాతం మంది ముస్లింలున్నారు. 110 శాసనసభ స్థానాల్లో మైనార్టీలే నిర్ణయాత్మక శక్తి. ఈ నేపథ్యంలో అసదుద్దీన్‌ ఒవైసీ బెంగాల్‌ ఎంఐఎం నాయకులతో భేటీ అయ్యారు. బెంగాల్‌లో ఇప్పటిదాకా 22 జిల్లాల్లో పార్టీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బిహార్‌లో బీజేపీ బి–టీం ఎంఐఎం అనే విమర్శలు వెల్లువెత్తాయి. తమ రాష్ట్రంలో ముస్లింలను విభజించడానికి రూ.కోట్లు ఖర్చుపెట్టి హైదరాబాద్‌ నుంచి ఒక పార్టీని తీసుకువచ్చింది అంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సినీ నటుడు కమల్‌ హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకోనుందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.   

 దళిత–ముస్లిం ఫార్ములా  
2017లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 34 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కరు కూడా నెగ్గలేదు. ఇటీవల బిహార్‌ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సుహల్‌ దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని కూటమిలో తాము చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) అధ్యక్షుడు శివపాల్‌ సైతం ఎంఐఎంతో పొత్తు దిశగా సంకేతాలిస్తున్నారు. బిహార్‌లో 5 సీట్లు గెలిచేందుకు సహకరించిన బీఎస్పీ నేత మాయావతితో యూపీ లోనూ ఒవైసీ జట్టుకట్టే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. బిహార్‌లో కలిసొచ్చిన దళిత–ముస్లిం ఫార్ములాను యూపీలోనూ వాడుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top