కాళ్లపై పడేందుకైనా సిద్ధం..: కేజ్రీవాల్‌

Arvind Kejriwal Appeals To Centre To Take Back GNCTD Bill - Sakshi

ఆ బిల్లును ఉపసంహరించండి

కేంద్రానికి ఢిల్లీ ముఖ్యమంత్రి

అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యర్థన

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)కి పలు విధులు, అధికారాలను కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును వెనక్కు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. ఆ బిల్లు ఉపసంహరణ కోసం ఏం చేయడానికైనా, అవసరమైతే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాళ్లపై పడేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆ ‘గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(అమెండ్‌మెంట్‌) బిల్‌ (జీఎన్‌సీటీడీ)’ను వ్యతిరేకిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. ఎల్జీకి అపరిమిత అధికారాలిచ్చే ఆ సవరణ బిల్లు చట్టరూపం దాలిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాలని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ‘ఎన్నికలకు, ఓట్లకు, మేం గెల్చుకున్న 62 స్థానాలకు అర్థం లేదా?’ అని ప్రశ్నించారు.

బిల్లును వెనక్కు తీసుకోవాలని, రాష్ట్ర ప్రజలను మోసం చేయవద్దని కేంద్రాన్ని అభ్యర్థించారు. ‘ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు, రాష్ట్ర ప్రజల అధికారాన్ని నిలబెట్టేందుకు అవసరమైతే.. ఈ బిల్లును నిలిపేయాలని కోరుతూ వారి కాళ్లపై పడేందుకు సిద్ధమే’నన్నారు. తన ప్రభుత్వాన్ని బలహీన పర్చే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆప్‌ గెలుపును చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే ఈ బిల్లును తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో ఆప్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

ఈ చట్టం ద్వారా ఢిల్లీ రాష్ట్రంలోకి దొడ్డిదారిన ప్రవేశించాలని బీజేపీ అనుకుంటోందని ఆప్‌ నేత గోపాల్‌ రాయ్‌ ఆరోపించారు. ధైర్యముంటే ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి చూపాలని సవాలు విసిరారు. ఈ బిల్లును సోమవారం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ‘ఢిల్లీ అసెంబ్లీ చేసే ప్రతీ చట్టానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనే అర్థం’ అని ఈ బిల్లు నిర్దేశిస్తుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయంపై అయినా ముందుగా ఎల్జీ అభిప్రాయం తీసుకోవడం తప్పని సరి అని ఆ బిల్లులో పొందుపర్చారు.

చదవండి: 3 కోట్ల రేషన్‌ కార్డుల తొలగింపా.. సుప్రీం కోర్టు ఆగ్రహం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top