
సాక్షి, గుంటూరు: తన వ్యక్తిగత జీవితం, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కిరాక్ ఆర్పీ, సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదులు చేశాను. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది’’ అని అంబటి పేర్కొన్నారు.
‘‘ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించనున్నాను. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. మహిళలను ఉదయం ఆరు లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతోంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం.
‘‘గుంటూరు సీఐడి కార్యాలయానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే.. ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటే వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు.. మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
