అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్‌ | AIADMK Crisis: Rebel MLAs Demand Palaniswami Resignation | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్‌

May 17 2026 7:23 AM | Updated on May 17 2026 7:36 AM

AIADMK Crisis: Rebel MLAs Demand Palaniswami Resignation

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి  స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.

ఓ శిబిరం సీఎం విజయ్‌ ప్రభుత్వానికి  మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్‌.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.

ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ  సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.

ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక  ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్‌ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్‌ లేదా గవర్నర్‌ ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్‌ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.

ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు.   

Advertisement
 
Advertisement
Advertisement