రైతు చుట్టూ రాజకీయం  | Agricultural laborers are targeted by parties for campaigning | Sakshi
Sakshi News home page

రైతు చుట్టూ రాజకీయం 

Published Sun, Nov 26 2023 5:15 AM | Last Updated on Mon, Nov 27 2023 3:12 PM

Agricultural laborers are targeted by parties for campaigning - Sakshi

ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. రైతులను  ప్రసన్నం చేసుకుంటేనే అధికారం దక్కుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.  అందుకే రైతు కేంద్రంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ మేరకు  ఆయా పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో  కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్‌గా చేసుకొని  ప్రచారం చేస్తున్నాయి.

వ్యవసాయం : 2 కోట్ల మంది 
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా సెంటు భూమిలేని కౌలు రైతులు 6 లక్షల మందికి పైగా ఉంటారు. అంటే రైతులు, కౌలుదారులు కలిపి దాదాపు 72 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు ఓ లెక్క. కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున ఓటు హక్కు కలిగి ఉన్నా, దాదాపు కోటిన్నర మంది వరకు ఉంటారు.  ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 52 లక్షలు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన వారే 2 కోట్ల మంది ఉంటారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. 

బీఆర్‌ఎస్‌ రైతుబంధు రూ.16 వేలు 
రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ రైతులపై పెద్ద ఎత్తున ఫోకస్‌ పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద రైతులకు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 72 వేల కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తుండగా, మరోసారి అధికారం అప్పగిస్తే విడతల వారీగా పెంచుతామని తెలిపింది.

రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12 వేల రూపాయలకు పెంచుతామని హామీనిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ... గరిష్టంగా ఎకరానికి ఏటా 16 వేల రూపాయలకు పెంచుతామని చెబుతోంది. రైతుబీమా ఎలాగూ ఉంది. అయితే గత రెండుసార్లు రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన బీఆర్‌ఎస్, ఈసారి మాత్రం తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని ప్రకటించకపోవడం గమనార్హం. 

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ 
రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తోంది. 24 గంటల ఉచిత కరెంట్‌ కాంగ్రెస్‌ పేటెంట్‌ అని ఆ పార్టీ చెబుతోంది. రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఒక్కో రైతుకు రూ. 15 వేలు ఇస్తామని వెల్లడించింది. కౌలు రైతులకు రైతు భరోసా రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది.

ఇక వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇస్తామని పేర్కొంది. అలాగే రైతు డిక్లరేషన్లో భాగంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపింది. మద్దతు ధరకు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది. భూమి యాజమాన్య హక్కులను అందిస్తామని, పోడు భూముల రైతులకు, అసైన్డ్‌ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది.  రైతు కమిషన్‌ ఏర్పాటుతో సహా సరికొత్త వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. 

వరికి మద్దతు ధర రూ. 3,100 ఇస్తామన్న బీజేపీ 
మరోవైపు తామూ అధికారంలోకి వస్తామని చెబుతోన్న బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ. 2,500 సాయం అందిస్తామని తెలిపింది. ఉచిత పంటల బీమాను ప్రకటించింది. వరికి రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని తెలిపింది. పసుపు కోసం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందిస్తామని తెలిపింది. జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్‌ టర్మరిక్‌ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.  

ఏమాత్రం తగ్గని లెఫ్ట్‌ పార్టీల మేనిఫెస్టో... 
ఇక ఒంటరిగా బరిలో నిలిచి 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు అనుకూలంగా అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని కోరుతామని, రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని, ధరల నిర్ణాయక కమిషన్‌ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరుతామని స్పష్టం చేసింది.

కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సి డీలు, పంట బీమా, కౌలు, పోడు తదితర రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించా లని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా మని సీపీఎం పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్‌ మద్దతుతో ఒక స్థానంలో పోటీ చేస్తున్న సీపీఐ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపర్చింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరింది. ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొంది.  

-బొల్లోజు రవి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement