నేటితో వీక్లీ రైళ్ల నిలిపివేత
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాకపోకలు సాగించే తిరుచానూరు(07603) నాందేడ్‌తోపాటు జల్నా–తిరుపతి(07814) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బుధవారం రద్దు కానున్నాయి. గత జూన్, జూలై నుంచి ఉమ్మడి జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట ప్రాంతాల ప్రయాణికులకు సేవలు అందించాయి. తిరుచానూరు, శ్రీకాళహాస్తి, తిరుపతి, కాణిపాకం వెళ్లే వేలాది మంది భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేవి. వీటిని యధావిధిగా నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా, బుధవారం నుంచి కాజీపేట, రామగుండం మీదుగా నడిచే దాణాపూర్–బెంగళూరు కంటోన్మెంట్(03241) ప్రత్యేక రైలు మధ్యాహ్నం కాజీపేటకు, బెంగళూరు–దాణాపూర్ మధ్య నడిచే(3242) ప్రత్యేక రైలు మరుసటి రోజు సికింద్రాబాద్, కాజీపేటకు చేరుకుంటాయి. అదేవిధంగా దాణాపూర్–ఎర్నాకులం(03221) ప్రత్యేక రైలుకు బల్హర్షా, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. చర్లపల్లి–రాక్సల్(05527/28) రైలుకు కాజీపేట, రామగుండం, బల్హర్షాలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
కొడిమ్యాల: అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడిమ్యాల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలాపూర్‌కు చెందిన బావు సత్యం (45) ఆర్నెళ్ల క్రితం ఇంట్లో జరిగిన గొడవల కారణంగా తన సొంతూరైన కోనాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యం మనస్తాపానికి లోనయ్యాడు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కోనాపూర్ శివారులోని కల్లు మండపం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్యం భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.


