కోల్‌సిటీ: రామంజాపూర్‌కు చెందిన నిమ్మల పృథ్వీరాజ్ తండ్రి నర్సయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆ సమయంలో సీపీఆర్ చేయడం తెలిసి ఉంటే తండ్రి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేదని పృథ్వీరాజ్ ఆవేదన చెందారు. ఇటీవల గోదావరిఖనిలో 1,500 మందికి సీపీఆర్‌పై అవగాహన కల్పించిన కార్యక్రమంతో స్ఫూర్తి పొందిన ఆయన.. తన తండ్రి సంస్మరణ రోజున గ్రామస్థులకు ఈ ప్రాణరక్షణ పద్ధతులపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించుకున్నారు.
గ్రామానికి వచ్చి శిక్షణ
కర్ణాటకలో ఎంబీబీఎస్ చదువుతున్న పృథ్వీరాజ్ తన స్నేహితుడు, గుడ్‌విల్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పాక ప్రశాంత్‌ను సంప్రదించారు. దీంతో ప్రశాంత్ ఆధ్వర్యంలో జి. ఆర్యతేజ, కె. స్నిగ్ధ భావన, ఎస్. రూపాలి, పాక ప్రవీణ్, ఎస్. అపరంజి, కె. అశ్విత్‌సాయి, ఆర్. చరణ్ గ్రామానికి చేరుకుని అవగాహన కల్పించారు. స్వచ్ఛందంగా వచ్చి శిక్షణ ఇచ్చిన వైద్య విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు.
ప్రత్యక్ష ప్రదర్శనతో అవగాహన
గుండె స్పందన ఆగినప్పుడు సీపీఆర్ ఎలా చేయాలి, మూర్ఛ వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ఎలా అందించాలి, గొంతులో ఆహారం లేదా ఇతర వస్తువులు ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి, నీటిలో మునిగిన వారిని రక్షించిన తర్వాత ఎలాంటి సహాయం అందించాలనే అంశాలను వైద్య విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రదర్శించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా తక్షణ ప్రథమ చికిత్స అందించడంతోపాటు వెంటనే వైద్య సహాయం పొందేలా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ ప్రాణరక్షణ పద్ధతులపై కనీస అవగాహన అవసరమని తెలిపారు.


