గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు శుభవార్త. వారి పిల్లలకు ఉచిత విద్య అందించే బాధ్యతను యాజమాన్యం తీసుకుంది. మొత్తం 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30వేల మంది కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు పదోతరగతి వరకు ఉచిత విద్య అందించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కీలక నిర్ణయం వెలువరించింది. ఇప్పటివరకు సింగరేణి ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తుండగా, తాజా నిర్ణయంతో విద్యకూడా అందుబాటులోకి రానుంది.
9 స్కూళ్లు.. 400 మందికి చదువు
సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న తొమ్మిది పాఠశాలల్లో చదువుతున్న 400 మందికిపైగా పిల్లలకు తక్షణమే ఈ నిర్ణయం వర్తించనుంది. వచ్చేసంవత్సరం నుంచి వీరితోపాటు కొత్తగా చేరే పిల్లలకూ ఈసౌకర్యం వర్తించనుంది.
గుర్తింపు అందించాల్సిందే..
సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్య పొందే కాంట్రాక్టు కార్మికులు తమ గుర్తింపు కార్డు(ఐడీకార్డు), ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌లను అధికారుల ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో సింగరేణి పాఠశాలల్లో తమ పిల్లలకు పదో తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే అవకాశం కలుగనుంది.
సీబీఎస్‌ఈ విద్యా విధానంతో మరింత మేలు
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సింగరేణి పాఠశాలలు మరో అడుగు ముందుకేసి సీబీఎస్‌ఈ విద్యావిధానానికి శ్రీకారం చుట్టాయి. సింగరేణిలోని ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ పాఠశాలలో ఏడాది నుంచి సీబీఎస్‌ఈ విద్యా విధానం కొనసాగుతోంది. దీంతో ఈపాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల పిల్లలకూ ఇందులో ప్రవేశం కల్పించనున్నారు.


