నిరంతర ప్రక్రియ
మంథనిరూరల్: ‘ఒకేదేశం – ఒకేవిద్యార్థి గుర్తింపు నంబర్’ నినాదంతో రూపొందించిన అపార్ పథకం ద్వారా ప్రతీవిద్యార్థికి శాశ్వత అకడమిక్ నంబర్ ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా శాశ్వత గుర్తింపు నంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అపార్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గతేడాది నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుండగా విద్యార్థుల బయోడేటాలో లోపాలతో ఆలస్యమైంది. ఈఏడాదిలోగా ప్రక్రియను పూర్తిచేసేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
● జిల్లావ్యాప్తంగా 745 పాఠశాలల్లో..
జిల్లాలోని 745 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అపార్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 80 శాతం నమోదు పూర్తికాగా కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 1,01,203 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 80,696 మంది అపార్ నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
● బయోడేటాలో అనేక లోపాలు..
అపార్ ప్రక్రియలో విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పక్కాగా నమోదు చేయాలి. అనేకమంది వివరాలు సక్రమంగా లేక పోవడంతో నమోదులో ఆలస్యం అవుతోంది. పాఠశాల రిజిస్టర్‌లోని పుట్టిన తేదీ ఆధార్‌లోని తేదీతో సరిపోలడంలేదు. ఇంటిపేర్లు అసంపూర్తిగా ఉండటం, తల్లిదండ్రులు పూర్తి వివరాలు అందించకపోవడమే ఆలస్యానికి కారణమంటున్నారు.
● జీవితాంతం ఒకే అకడమిక్ నంబర్
అపార్ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతీవిద్యార్థికి జీవితాంతం ఒకే అకడమిక్ నంబర్ ఉంటుంది. దీనిద్వారా విద్యార్థి ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయంలో ఊరట కలుగుతుంది.
అపార్ నమోదు వివరాలు..
మండలం స్కూళ్లు విద్యార్థులు నమోదు
అంతర్గాం 29 3,327 2,504
ధర్మారం 69 9385 7594
ఎలిగేడు 20 1,263 841
జూలపల్లి 27 2,754 2,282
కమాన్‌పూర్ 22 1,910 1,605
మంథని 72 6,723 5,482
ముత్తారం 34 2,140 1,625
ఓదెల 42 2,861 2,130
పాలకుర్తి 36 3,977 3,287
పెద్దపల్లి 112 17,390 14,008
రామగిరి 37 4,539 3,191
రామగుండం 119 31,348 25,436
శ్రీరాంపూర్ 51 3,393 2,614
సుల్తానాబాద్ 75 10,193 8,097
అపార్ నమోదు వేగవంతం చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ముఖ్యంగా విద్యార్థుల ఆధార్‌లో పుట్టిన తేదీ సక్రమంగా ఉండడంలేదు. పాఠశాల రిజిస్టర్‌లో పుట్టిన తేదీకి ఆధార్‌లోని తేదీకి తేడా ఉంటోంది. పుట్టినతేదీ సవరణతోనే ఆలస్యం అవుతోంది. పుట్టినతేదీ మార్పు చేసుకున్న వారి వివరాలను వెంటనే నమోదు చేయిస్తున్నాం.
– చేపూరి మల్లేశ్‌గౌడ్, డిస్ట్రిక్ ప్లానింగ్ కో ఆర్డినేటర్


