మల్యాల: మద్యం మత్తు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. క్షణికావేశం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నప్పటికీ 24ఏళ్ల కాపురంలో తరచూ గొడవలే. చివరకు భార్యాభర్తల మధ్య గొడవ ఇద్దరి మృతికి దారి తీసింది. మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి చంపిన భర్త లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మల్యాల మండలం నూకపల్లిలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓలపు నాగరాజు(47), అదే గ్రామానికి చెందిన లక్ష్మి (43) ఇరవై నాలుగేళ్ల క్రితం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. లక్ష్మి బీడీలు చుడుతుంది. నాగరాజు వ్యవసాయ పనులకు కూలీకి వెళ్తుంటాడు. సంతానం లేకపోవడంతో సమీప బంధువు నుంచి బాబు (6)ను దత్తత తీసుకున్నారు. నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతున్నాడు. ఆదివారం కూడా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న భార్య గొంతు నులిపి చంపాడు. వెంటనే తన లుంగీతో ఇంట్లోని దూలానికి ఉరేసుకున్నాడు. వేకువజామున నిద్ర లేచిన కుమారుడు రియాన్ష్ భయపడి.. ఇంటి పక్కనున్న బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారి సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనాథగా మారిన ఆరేళ్ల కుమారుడు..
భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడంతో ఆరేళ్ల రియాన్ష్ అనాథగా మారాడు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియని పసి వయసులో వారి మృతదేహాలను చూస్తూ ఉండిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సందీప్ క్లూస్ టీంతో ఇంట్లో తనిఖీ చేశారు. మద్యానికి బానిసై భార్యతో గొడవపడి నిద్రిస్తున్న లక్ష్మిని తువ్వాలతో గొంతు నులిపి చంపాడని మృతురాలి తల్లి గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
మద్యం మత్తులో ఘాతుకం
అనాథగా మారిన ఆరేళ్ల బాలుడు
నూకపల్లిలో విషాదం


